ఒకటా రెండా దాదాపు 50 రోజుల తరువాత నేడు తెలంగాణలో మద్యం దుకాణాలు తెరచుకోనుండటంతో, ఈ తెల్లవారుజామునే మద్యం వ్యాపారులు రంగంలోకి దిగారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈ నాడే ఎదురౌతుంటే.. అన్న చందంగా ఇప్పటి వరకు సుక్క మందు లేక బిక్కచచ్చిన మందుబాబులకు పండుగు చేసుకునే రోజు రానే వచ్చింది.  ఇలాంటి మంచి తరుణం ఎలాంటి పరిస్థితుల్లోనూ మిస్ కావొద్దన్న కసితో ఉన్నారు.   లాక్ డౌన్ నిబంధనలు, ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా షాపుల వద్ద చర్యలు ప్రారంభించారు. మార్కింగ్ లైన్స్, రౌండ్స్ గీస్తూ, కస్టమర్లు భౌతిక దూరాన్ని పాటించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రెడ్ జోన్లు మినహాయించి.. మిగిలిన 27 జిల్లాలకు పరిమిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

 

మద్యం కొనుగోలుకు వచ్చే వారంతా ఓ క్రమపద్ధతిలో నిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే వైన్స్ షాపుల యజమానులకు సూచనలు జారీ చేశామని అన్నారు. ఇక ఉదయం 10 గంటలకు షాపులు తెరచుకోనుండగా, ఉదయం 9 గంటల నుంచే మందుబాబుల సందడి మొదలైంది.  అయితే ఉదయం నుంచి ఎక్కువ సమయం నిలబడే ఓపిక లేని వారు.. తమకు ఎంతో రక్షణగా ఉంటున్న పాద రక్షలను నమ్ముకున్నారు. 

 

వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలా చోట్ల మందుబాబులు తమ నోరు తడుపుకోడానికి తమ చెప్పులను ఇలా క్యూలో ఉంచి ఎండ నుండి తమను తాము కాపాడుకుంటున్నారు. సామాజిక దూరం కోసం ఏర్పాటు చేసిన మార్కింగ్‌లలో తమ చెప్పులను ఉంచి నీడకు వెళ్ళి కూర్చుంటున్నారు. అదన్నమాట.. చెప్పులు ఇలా కూడా రక్షణ కల్పిస్తాయని మందుబాబుల ద్వారా తెలిసిందని నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: