విశాఖలోని  గోపాలపట్నంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో భారీగా గ్యాస్‌ లీక్‌ అయిన విషయం విదితమే. ఈ ఘటనతో ఒక్కసారిగా 5 కిలోమీటర్ల మేర కెమికల్ గ్యాస్ వ్యాపించింది. దీంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే ముగ్గురి మృతి చెందారని.. సుమారు 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. పాలిమర్స్‌ బాధితులతో కేజీహెచ్‌ నిండిపోయింది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అంబులెన్స్‌లు, వ్యాన్లు, కార్లలో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. 

 

ఇదిలా ఉంటే.. విషవాయువు ప్రభావంతో కళ్లు కనపడక బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రవుతున్నారు. మరోవైపు వెంకటాపురంలో పశువులు మృత్యువాత పడ్డాయి. పాలిమర్స్ చుట్టూ ఉన్న చెట్లు మాడిపోయాయి. మరోవైపు సహాయక చర్యలు అందించడానికి వచ్చిన పలువురు పోలీసులు కూడా అస్వస్థత గుర‌య్యారు. వారిని కూడా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అంతేకాగ‌... ఘటనను పరిశీలించడానికి వచ్చిన డీసీపీ ఉదయ్‌భాస్కర్‌ కూడా అస్వస్థతకు గురయ్యారు. మరో రెండు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మీడియాకు వెల్లడించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: