విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున భారీ ప్రమాదం జరిగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు 5 కిలోమీటర్ల మేర వ్యాపించింది.  వాసనకు కడుపులో వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ప్రజలు, పశుపక్ష్యాదులు నానా అవస్థలు పడ్డాయి. మరికొందరు రోడ్డుపైనే అపస్మారక స్థితిలో పడిపోయారు. ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు  తరలించారు.  అస్వస్థతకు గురైన చిన్నారులు, మహిళలను ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే..  విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో మళ్లీ స్వల్పంగా కెమికల్ వాసన వస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

కంపెనీ పక్కనే మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ ఉండడంతో నీటి పైన కూడా దీని ప్రభావం ఉంటుందని స్థానికులు భయపడుతున్నారు. ఇప్పటికే తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటి అక్కడ భద్రతా చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువు విశాఖను ముంచేసింది. కెమికల్‌ను పీల్చడంతో ప్రజలు ఎక్కడికక్కడే పడిపోయి అస్వస్థతకు గురయ్యారు. వందల మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.  విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువులు లీక్ అయిన నేపథ్యంలో ఆ కంపెనీ చుట్టుపక్కల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సింహాచలం స్టేషన్ సమీపంలో అధికారులు రైళ్లను నిలిపివేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: