దేశంలో ఏ ముహూర్తంలో కరోనా మహమ్మారి ప్రవేశించిందో కానీ.. మనుషులకు మనశ్శాంతి లేకుండా పోయింది.  వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వెయ్యికి పైగా మరణాలు సంబవించాయి. ఈ ఉపద్రవం సమసిపోలేదు.. ఈ రోజు విశాఖపట్టణంలో  జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటనతో తీవ్ర కలకలం రేగింది. ఇప్పటి వరకు పదకొండ మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. వెయ్యికి పైగా ఈ విషవాయువు ప్రభావం వల్ల సతమతమవుతున్నారు. ఈ ఘటన మరువక ముందే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మరో సంఘటన జరిగింది. రాయ్ గఢ్ లోని పేపర్ మిల్లులో ట్యాంక్ శుభ్రం చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సమాచారం మేరకు రెస్క్యూ బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.   

 

వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని రాయగఢ్ ఎస్పీ సంతోష్ సింగ్, జిల్లా కలెక్టర్ యశ్వంత్ కుమార్ తెలిపారు. పేపర్ మిల్లులో గ్యాస్ లీకైన ఘటనలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన అనంతరం జిల్లా ఎస్పీ, కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. కాగా, ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పకుండా దాచిపెట్టి ఈ ఘటనను బయటికి పొక్కకుండా ఉంచేందుకు పేపర్ మిల్లు యాజమాన్యం ప్రయత్నించిందని జిల్లా ఎస్పీ సంతోష్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్టు ఎస్పీ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: