విశాఖలోని ఆర్ ఆర్ వెంక‌టాపురం గ్రామ స‌మీపంలో ఉన్న ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీలో మ‌రోసారి స్టెరిన్ గ్యాస్ లీకైందంటూ పుకార్లు జ‌ర‌గ‌డంతో జ‌నం భీతిల్లిపోతున్నారు. నిన్న రాత్రి మరోసారి గ్యాస్ లీకైందన్న పుకార్లు రావ‌డంతో ప్రజలు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఫ్యాక్టరీ న‌గ‌ర‌వాసుల‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్ర‌జ‌లు, ప్రజలు నిద్ర లేని రాత్రిని గడిపారు. రోడ్ల మీదకు వచ్చి జాగారం చేశారు. రోడ్ల‌న్నీ జాతరను తలపించాయి. న‌గ‌రం నుంచి వేల మంది కంచరపాలెం, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. గురువారం రాత్రి 11 గంటలు దాటాక కూడా పెట్రోల్ బంకులు వాహ‌నదారుల‌తో నిండిపోయాయి. ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో ప్ర‌జ‌లు వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. ఇక‌ వీలుకాని వాళ్లు, వాహ‌నాలు దొర‌క‌ని కొందరు రోడ్లపైనే నిద్రపోయారు. మ‌రోవైపు కంపెనీ స‌మీపంలో ఐదు గ్రామాల ప్ర‌జ‌లను సింహాచ‌లంలో ఏర్పాటు చేసిన పున‌రావాస‌కేంద్రాల‌కు అధికారులు త‌ర‌లించారు.

 

ఇదిలా ఉండ‌గా.. ఇప్ప‌టివ‌ర‌కు 12 మంది మృతి చెందారు. విశాఖ‌లోని కేజీహెచ్ ఆస్ప‌త్రిలో 193 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో 45 మంది చిన్నారులు ఉన్నారు. అలాగే మ‌రికొన్ని ఆస్ప‌త్రుల్లో మూడు వంద‌ల‌మందికిపైగా బాధితులు చికిత్స పొందుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. మృతుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు గుజ‌రాత్ నుంచి వ‌చ్చిన ప్ర‌త్యేక బృందం ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీలో రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. గ్యాస్ లీకేజీని అపేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. గుజ‌రాత్ నుంచి ప్ర‌త్యేకంగా తీసుకొచ్చి న్యూట్రిలైజ్ కెమిక‌ల్స్‌తో రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌డుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: