విశాఖ గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ ప్ర‌భుత్వం స్పందించిన తీరు బాధాక‌ర‌మ‌ని టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. ఎల్జీ పాలిమ‌ర్స్‌ కంపెనీ యాజ‌మాన్యంపై సాధార‌ణ కేసులే పెట్టార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయిలో ద‌ర్యాప్తు జ‌ర‌గాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న మాన‌వ త‌ప్పిద‌మా..?  లేక టెక్నిక‌ల్ స‌మ‌స్యా..? అన్న‌ది తేలాల్సి ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇలాంటి ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తి ఇచ్చేట‌ప్పుడు నిబంధ‌న‌లు పాటించాల‌ని అన్నారు. స్టీరిన్ గ్యాస్ లీక్ అవ్వడం ఎప్పుడు జరగలేదని ఆయన పేర్కొన్నారు. విశాఖ వెళ్ళడానికి కేంద్రాన్ని అనుమతి కోరాన‌ని ఆయన పేర్కొన్నారు. కంపెనీ స‌మీపంలో ఉన్న‌వారంద‌రినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చంద్ర‌బాబు అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల‌ని ఆయ‌న సూచించారు. విశాఖ ఘ‌ట‌న‌పై ముఖ్యమంత్రి జ‌గ‌న్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన చాలా సులువుగా తీసుకున్నట్టు ఉందని చంద్ర‌బాబు ఆరోపించారు.

 

ప్రభుత్వానికి సీరియస్ నెస్ లేకనే హైకోర్ట్ జోక్యం చేసుకుని సుమోటో గా తీసుకుందని ఆయ‌న‌ అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా నోటీసులు జారీ చేసి 50 కోట్లను కోర్ట్ లో డిపాజిట్ చెయ్యాలని సూచించిందని చంద్ర‌బాబు పేర్కొన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనేది చూడాల్సి ఉందని అన్నారు. కంపెనీపై చిన్న చిన్న కేసులు పెట్టేసి సీరియస్ గా తీసుకున్నామని అనడం సరికాదని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ప్రజల ప్రాణం చాలా విలువైనదని ఆయ‌న పేర్కొన్నారు. జనాల మధ్యలో కంపెనీ ఉండటం సరికాదని బాధితులకు, మళ్ళీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం విచారణ తూతూ మంత్రంగా చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ ప్ర‌జ‌లు ధైర్యంగా ఉండాల‌ని చంద్ర‌బాబు కోరారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: