తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా పేషెంట్ల‌కు ప్లాస్మా థెర‌పీ చేయ‌నున్నారు. ఈ మేరక చ‌క‌చ‌కా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. కరోనా రోగులపై ప్లాస్మా ట్రయల్స్‌ చేసేందుకు గాంధీ ఆసుపత్రితోపాటు హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ హాస్పిటల్‌కు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అనుమతి ఇచ్చింది. అయితే.. దేశవ్యాప్తంగా మొత్తం 113 ఆసుపత్రులు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 28 ద‌వాఖాన‌ల‌కు అనుమతి ఇచ్చారు. అందులో భాగంగా తెలంగాణ‌ రాష్ట్రంలో రెండింటికి  మాత్ర‌మే అనుమతి వచ్చింది. ప్రస్తుతం ఈఎస్‌ఐసీలో కరోనా చికిత్సలు చేయడం లేదు. అయితే.. ప్లాస్మా ట్రయల్స్‌కు అనుమతి వచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా కరోనా చికిత్స ప్రారంభించే అవకాశముంది. అలాగే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ముందస్తుగా ప్లాస్మా సేకరణకు అనుమతులు ఇచ్చింది.

 

ఈ మేరకు రెండు చోట్ల ప్లాస్మా సేకరణ చేయనున్నట్లు కోవిడ్‌-19 స్టేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ నోడల్‌ అధికారి డా. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి స్విమ్స్, కర్నూలు మెడికల్ కాలేజిలో ప్లాస్మా సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.  ఇక సేకరించి ప్లాస్మాను -40 డిగ్రీల వద్ద ప్రిజర్వ్‌ చేస్తున్నామని ఆయన తెలిపారు.  కరోనా నుంచి కోలుకున్న రోగుల నుంచి 14 రోజుల తర్వాత వారి ప్లాస్మా సేకరిస్తే, యాంటీ బాడీస్‌ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగపతుందని చెప్పారు. ఇప్పటివరకు కేవలం ప్లాస్మా సేకరణ మాత్రమే చేస్తున్నామని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఐసీఎంఆర్ అనుమ‌తితో ఏపీలోనూ క‌రోనా రోగుల‌కు ప్లాస్మా థెర‌పీ అందించ‌నున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: