తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతోంది. రోజువారీగా చాలా త‌క్కువ సంఖ్య క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఈ క్ర‌మంలో ఒక్కో జిల్లా కరోనా మ‌హ‌మ్మారిని జ‌యించి గ్రీన్ జోన్‌లోకి వ‌స్తున్నాయి. ఇదే విష‌యాన్ని ఆరోగ్య‌శాఖ‌ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వెల్ల‌డించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్తగా కరోనా కేసులు నమోదుకాని మరో 14 జిల్లాలను గ్రీన్‌జోన్లుగా నిర్ధారించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు ఆయ‌న తెలిపారు.శుక్రవారం కోఠి కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు రాష్ట్రంలో 9 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయన్నారు. కొత్తగా మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నారాయణపేట, వికారాబాద్‌, నల్లగొండ, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, జనగాం జిల్లాలను గ్రీన్‌జోన్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరామని పేర్కొన్నారు.

 

ఈ మేరకు కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కూడా దీనిపై చర్చించినట్టు స్పష్టంచేశారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి సోమవారం ప్రకటిస్తామని కేంద్రమంత్రి చెప్పారని తెలిపారు. రెడ్‌జోన్‌లోని సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, వికారాబాద్‌ జిల్లాల్లో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదుకావడం లేదని, ఆ జిల్లాలను ఆరెంజ్‌జోన్‌గా నిర్ధారించాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి వివరించారు. రెడ్‌జోన్‌లోని హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఇక ముందు కరోనా కేసులు తగ్గుతాయని ఆశిస్తున్నామమ‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: