ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీపై కొంత అస‌హ‌నం, అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఎందుకీ అసంతృప్తి అంటే.. కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లును తీసుకొస్తోంది. దీనిపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్రం రూపొందించిన బిల్లు అమ‌లులోకి వ‌స్తే.. స‌బ్సిడీలు ర‌ద్దయిపోతాయ‌ని, విద్యుత్ ఉత్ప‌త్తికి అయ్యే ఖ‌ర్చు, స‌ర‌ఫ‌రా న‌ష్టాలు, ఉద్యోగుల జీత‌భ‌త్యాలు, త‌దిత‌ర ఖ‌ర్చుల‌న్నీ క‌లుపుకుని అయ్యే మొత్తం వ్య‌యం ఆధారంగా యూనిట్ ధ‌ర‌ను నిర్ణ‌యిస్తార‌ని, దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ స‌బ్సిడీని పొందుతున్న వారంద‌రూ బిల్లుల భారాన్ని మోయాల్సి వ‌స్తుంద‌ని తెలంగాణ ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు, టీఆర్ఎస్‌ అనుకూల మీడియా అంటోంది. అలాగే.. మ‌రికొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే.. దీనిపై మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ రాష్ట్రాల‌కు అవ‌స‌రమైన విద్యుత్‌ను ప‌లు కంపెనీల నుంచి కొనుగోలు చేస్తాయి. వాటికి న‌చ్చిన విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాల వ‌ద్ద క‌రెంట్‌ను కొంటున్నాయి.

 

అదేమిటోగానీ.. యూనిట్ రేట్ విష‌యంలో ఒక్కోరాష్ట్రం ఒక్కో విధంగా చెల్లిస్తాయి. మ‌రోవైపు.. ఆయా కంపెనీల‌కు చెల్లించాల్సిన బ‌కాయిల‌ను కూడా స‌కాలంలో చెల్లించ‌వు. దీంతో ఆ బ‌కాయిల‌న్నీ కూడా మ‌ళ్లీ వినియోగ‌దారుడిపైనే ప‌డుతాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. దీనిని నివారించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఈ కొత్త బిల్లును తీసుకొస్తుంద‌ని, ఇదే దేశ‌మంతటా ఒకే రీతిలో యూనిట్ రేట్ ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, దీంతో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, ప‌లు కంపెనీల‌కు ఉన్న లోపాయికారి ఒప్పందాలు ర‌ద్దు అవుతాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో వినియోగ‌దారుల‌కు, ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మైన నాణ్య‌మైన విద్యుత్ 24గంట‌ల పాటు అందుతుంద‌ని చెబుతున్నారు. అయితే.. విద్యుత్ ఉత్ప‌త్తి కంపెనీల‌పై పెత్త‌నం కోల్పోవ‌డాన్ని ఇష్ట‌ప‌డ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇలా.. కేంద్రం తీసుకొస్తున్న బిల్లుతో భారంప‌డుతుంద‌న్న త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయ‌ని విశ్లేషిస్తున్నారు. అయితే.. ఎవ‌రి వాద‌న‌లో నిజ‌ముందో తెలియాలంటే మ‌రికొంత కాలం వేచి చూడాల్సిందే మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: