భార‌త్‌లో ప్ర‌యాణికుల రైళ్లు నేటి నుంచి ప‌ట్టాలెక్కుతున్నాయి. మంగళవారం ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఢిల్లీ నుంచి దిబ్రుగఢ్‌, బెంగళూరు, బిలాస్‌పూర్‌కు ఒక్కోటి చొప్పున మూడు రైళ్లు, హౌరా, రాజేంద్రనగర్‌ (పాట్నా), బెంగళూరు, ముంబై సెంట్రల్‌, అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీకి ఒక్కోటి చొప్పున ఐదు రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ఈ రైళ్లలో మొదటి, రెండవ, మూడో తరగతి ఏసీ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు, ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను రైల్వేశాఖ‌ జారీ చేసింది. అయితే.. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తేనే రైలు ప్ర‌యాణం చేసే అవ‌కాశం ఉంటుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు సమానంగా చార్జీలు ఉంటాయి. ఏడు రోజుల ముందుగానే టికెట్ల బుకింగ్‌కు అవకాశం ఉంటుంది.

 

ప్రయాణానికి 24 గంటల ముందు టికెట్ల‌ను రద్దు చేసుకోవచ్చు. టికెట్‌ రద్దు చార్జీలు 50 శాతం ఉంటుంది. తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌, కరెంట్‌ బుకింగ్‌, ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌, ఆన్‌బోర్డు బుకింగ్‌లు లేవు. టికెట్లు బుకింగ్‌ చేసుకున్న వారికే ప్రయాణ అనుమతి ఉంటుంది. స్టేషన్‌కు చేర్చే వాహనం డ్రైవర్‌కూ టికెట్‌ ఆధారంగా అనుమతి ఇస్తారు. ప్ర‌యాణికులు ఆహారం, తాగునీరు, దుప్పట్లు వంటివి వెంట తెచ్చుకోవాలి. ప్రయాణానికి గంటన్నర ముందుగా రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. స్క్రీనింగ్‌ తర్వాత కరోనా లక్షణాలు లేనివారికి మాత్ర‌మే రైలులోకి అనుమతి ఇస్తారు. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మాస్కు ధ‌రించాలి. భౌతిక దూరం పాటించాల‌ని కండిష‌న్లు పెట్టింది రైల్వేశాఖ‌.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: