ప్ర‌పంచంలోనే భార‌తీయుల‌కే అత్యంత శ‌క్తిసామర్థ్యాలు ఉంటాయ‌ని, టాప్ టాలెంట్ భార‌తీయుల‌దేన‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అన్నారు. 21వ శ‌తాబ్దం భార‌త్‌దేన‌ని ఆయ‌న అన్నారు. భార‌త స్వావ‌లంబ‌నే.. ప్ర‌పంచ పురోగ‌త‌కి దోహ‌ద‌ప‌డుతుంద‌ని, ఈ ప్ర‌పంచానికి శాంతిని అందిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌పంచ స‌మ‌స్య ప‌రిష్కారానికి భార‌త్ కృషి చేస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి భార‌త్ ప్ర‌పంచానికి మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తోంద‌ని అన్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ రాత్రి 8గంట‌ల‌కు జాతిని ఉద్దేశించి మాట్లాడారు. భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాలు విశ్వ‌శాంతికి, ప్ర‌పంచ అభివృద్ధికి స‌హకారం అందిస్తాయ‌ని ఆయ‌న అన్నారు. ఈ ప్ర‌పంచానికి యోగాను పరిచ‌యం చేసిన ఘ‌న‌త భార‌త్‌దేన‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అన్నారు. అనేక స‌వాళ్ల‌ను భార‌త్ సంక‌ల్ప‌బ‌లంతో ఎదుర్కొంద‌ని, క‌రోనా వైర‌స్ కూడా విజ‌యం సాధిస్తామ‌ని ఆయ‌న అన్నారు.

 

క‌రోనా వైర‌స్ సంక్షోభం మొద‌ట్లో భారతదేశంలో ఒక్క పిపిఇ కిట్ కూడా తయారు చేయ‌లేదని, కొన్ని N95 ముసుగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని... కానీ.. ఈ రోజు భారతదేశంలో రోజూ 2 లక్షల పిపిఇ కిట్లు, 2 లక్షల ఎన్ 95 ముసుగులు తయారు చేస్తున్నామ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అన్నారు. మాన‌వాళికి పెద్ద స‌వాల్‌గా మారుతున్న క‌రోనా వైర‌స్‌పై భార‌త్ గెలిచి తీరుతుంద‌ని ఆయ‌న అన్నారు. మ‌న‌ల్ని మ‌నం కాపాడుకుంటూ వైర‌స్‌పై యుద్ధం చేద్దామ‌ని మోడీ పిలుపునిచ్చారు. మ‌నంద‌రం మ‌రింత ఆత్మ‌స్థైర్యంతో ముందుకు వెళ్లాల‌ని ఆయ‌న కోరారు. మ‌రింత సంక‌ల్ప బ‌లంతో ముందుకు వెళ్లాల‌ని, ఇది గెలిచి తీరాల్సిన యుద్ధ‌మ‌ని ఆయ‌న అన్నారు. స్వీయ నియంత్ర‌ణ పాటిస్తూ మ‌నంద‌రం క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న సూచించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: