రైతును రాజు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముంద‌కు సాగుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పంట‌ల సాగులో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చే దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర రైతాంగానికి వీలైనంత లాభం చేకూర్చాలన్న లక్ష్యంతోనే, ఈ వానకాలం నుంచి నియంత్రిత పద్ధతిలో అంటే.. ప్ర‌భుత్వం చెప్పిన‌, సూచించిన‌ పంటలను మాత్ర‌మే రైతులు సాగుచేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే రైతుల ఆలోచ‌నా విధానంలో మార్పులు రావాలని.. ప్రభుత్వం సూచించిన పంటలనే సాగుచేయాలని కోరారు. అప్పుడే పండించిన పంటకు మద్దతుధర లభిస్తుందని పేర్కొన్నారు. నియంత్రిత పద్ధతిలో పంటలసాగును ఈ వానకాలం నుంచి వరితో మొదలుపెడతామన్నారు.

 

ఈ విషయాలపై చర్చించడానికి ఈ నెల 15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా మాట్లాడాలని ఆయ‌న‌ నిర్ణయించారు. రాష్ట్రంలో పంటమార్పిడి, క్రాప్‌కాలనీల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యాచరణను ముఖ్యమంత్రి అధికారులకు పూర్తిస్థాయిలో వివరించారు. తెలంగాణ వ్య‌వ‌సాయ విధానం ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా మార్గ‌ద‌ర్శ‌కంగా నిల‌వాల‌న్న సంక‌ల్పంతో కేసీఆర్ ముందుకు వెళ్తున్న‌ట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: