తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డిస్కంలకు రూ.90వేల కోట్ల న‌గ‌దు ల‌భ్య‌త ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ వెల్ల‌డించారు. అలాగే ఎన్‌బీఎఫ్‌సీ‌, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల‌కు రూ.30వేల కోట్ల న‌గ‌దు ల‌భ్య‌త ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు. రూ.20ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివ‌రాల‌ను బుధ‌వారం సాయంత్రం 4గంట‌ల‌కు ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆమె వెల్ల‌డించారు. సూక్ష్మ ప‌రిశ్ర‌మ‌ల పెట్టుబ‌డి ప‌రిధిని రూ.25 ల‌క్ష‌ల నుంచి రూ.కోటికి పెంచుతున్న‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ అన్నారు. రూ.5కోట్ల ట‌ర్నోవ‌ర్ చేసే కంపెనీలు కూడా సూక్ష్మ ప‌రిశ్ర‌మ‌ల కింద‌కే వ‌స్తాయ‌ని ఆమె పేర్కొన్నారు. సూక్ష్మ‌, మ‌ధ్య‌, ల‌ఘు, కుటీర ప‌రిశ్ర‌మ‌ల‌కు రూ.3ల‌క్ష‌ల కోట్లు కేటాయించిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. తీవ్ర‌మైన ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈల‌కు రూ.20వేల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. వివిధ మంత్రిత్వ‌శాఖ‌ల‌తో చ‌ర్చించాక ప్యాకేజీకి రూప‌క‌ల్ప‌న‌చేసిన‌ట్లు తెలిపారు.

 

ఈ ప్యాకేజీ అభివృద్ధికి తోడ్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ఈ ప్యాకేజీ భార‌త్ స్వావ‌లంబ‌న సాధించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, అందుకే దీనిని *ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ అభియాన్‌* అని పిలుస్తున్నామ‌ని ఆమె పేర్కొన్నారు.  లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన త‌ర్వాత గ‌రీభ్ క‌ల్యాణ్ యోజ‌న కింద ప్ర‌త్యేక ప్యాకేజీని ప్ర‌క‌టించి, అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆదుకున్నామ‌ని అన్నారు. రెండో ప్యాకేజీ స్వ‌దేశీ బ్రాండ్ల‌ను త‌యారు చేయ‌డానికి, అంత‌ర్జాతీయ గుర్తింపు సాధించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. దేశం స్వ‌యం స‌మృద్ధి సాధించేందుకు ఎంతోదోహ‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు. అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త ఉత్ప‌త్తుల‌కు గుర్తింపు తీసుకురావ‌డ‌మే ల‌క్ష్య‌మ‌న్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌, మౌలిక స‌దుపాయాలు, టెక్నాల‌జీ ఆధారిత వ్య‌వ‌స్థ‌, ప్ర‌జ‌లు, డిమాండ్ ఐదు అంశాల ఆధారంగా నిర్భ‌ర్ భార‌త్ మిష‌న్ చేప‌ట్టామ‌ని తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: