ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ట్రాక్టర్‌ ప్రమాదంలో కూలీలు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తక్షణ సహాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని, బాధిత కుటుంబాలను పరామర్శించాలని జిల్లా మంత్రులను సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకుంటామని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఘటన తనను కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన అధికారులను అప్రమత్తం చేసి ఘటనాస్థలానికి పంపించారు. కాగా, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మాచవరం గ్రామం సమీపంలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. కుమ్మరిడొంక వద్ద మిర్చి కూలీలతో వస్తున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే 9 మంది దుర్మరణం పాలయ్యారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  డ్రైవర్‌ మృతి చెందాడు. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: