తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ రెచ్చిపోతోంది. సామాన్యుల‌తోపాటు కొవిడ్‌వారియర్స్‌పై కూడా విరుచుకుప‌డుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిన్నమొన్నటి వరకు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని వైద్యులకు వైరస్‌ సోకగా.. ఇప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారు. మంగళవారం ఉస్మానియా మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థుల్లో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో శనివారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు మొత్తం బాధితుల సంఖ్య 12కు చేరింది. ఇక నిమ్స్‌లోనూ నలుగురు వైద్య విద్యార్థులకు కరోనా సోకడం క‌ల‌క‌లం రేపుతోంది. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ పరిధిలోని పేట్లబురుజు ఆస్పత్రి, ఉస్మానియా, నిలోఫర్‌, చెస్ట్‌, ఫీవర్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న విద్యార్థుల్లో కొందరికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.

 

గాంధీ ఆస్పత్రిలో కూడా ఒక పీజీ విద్యార్థికి పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. ఉస్మానియాలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌కు, నర్సుకు కరోనా సోకింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా 99 కేసులు నమోదవగా అందులో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 70 కేసులు ఉండడం గమనార్హం. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: