అది వంద‌రూపాయ‌ల నోటు.. దాని ఒంటినిండా గాయాలు.. ర‌క్త‌పు మ‌ర‌క‌లు.. చుట్టూ మాంస‌పు ముద్ద‌ల వాస‌న‌. రైలు ప‌ట్టాల కంక‌ర రాళ్ల మ‌ధ్య‌లో న‌లిగిపోయి.. చిరిగిపోయి.. ఒంట‌రిగా దుఃఖిస్తోంది. ఎందుకీ దుఃఖం.. ఎందుకీ శోఖం.. అని ఆరా తీస్తే.. దానిది ఛిద్ర‌మైన బ‌తుకుల చిరునామా అని తేలింది. రాత్రికి రాత్రే రైలు ప‌ట్టాల‌పై నిలువునా కూలిపోయిన వ‌ల‌స జీవుల కండ‌రాలే దాని జ‌న్మ‌స్థాన‌మ‌ని తేలింది. గాలికి అటూ ఇటూ కొట్టుకుంటూ అక్క‌డే త‌న‌వాళ్ల‌ను వెతుకుతోంది. వ‌చ్చీపోయే రైళ్లు త‌న‌ను ముక్కలు ముక్క‌లు చేస్తున్నా త‌న‌వాళ్ల కోసం దిక్కులు పిక్కిటిళ్లేలా రోదిస్తూనే ఉంది. ఔరంగాబాద్ రైలు ప్ర‌మాదం.. ప‌దహారు మంది వ‌ల‌స కార్మికులు ప్రాణాలు తీసిన ఘ‌ట‌న‌. సొంతూళ్ల‌కు వెళ్లేందుకు న‌డిచీన‌డిచీ అల‌సిపోయి ప‌ట్టాల‌పైనే నిద్రించిన కార్మికుల‌ను రైలు పొట్ట‌న‌బెట్టుకుంది.

 

తెల్ల‌వారేలోగా ప‌ట్టాల‌పై మాంస‌పు ముద్ద‌లుగా మారిపోయారు. అర్ధ‌రాత్రి జ‌రిగిన‌ ఈ ఘ‌ట‌న దేశాన్ని దుఃఖ‌సాగ‌రంలో ముంచింది. ఘ‌ట‌నా స్థ‌లంలో ప‌డి ఉన్న వంద‌రూపాయ‌ల నోట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. *రైలు పట్టాల మీద మరణించిన వలస కార్మికులు వదలి వెళ్లిన డ‌బ్బులు. సీఎం కేర్ ఫండ్‌కు జ‌మ చేయండి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే, ఎంపీల‌ను కొన‌డానికి ప‌నికివ‌స్తాయి* అంటూ కొంద‌రు కామెంట్స్ పెడుతూ ప్ర‌భుత్వంపై ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: