ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో ముస‌లాలు మొద‌ల‌వుతున్నాయి. ఒక్కొక్క‌రు క్ర‌మ‌క్ర‌మంగా అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తున్నారు. ఈ లిస్టులో ముందుగా నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డితో మొద‌లు అయ్యింది. ఆ త‌ర్వాత గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు, కందుకూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి, క‌డ‌ప, అనంత‌పురం జిల్లా ఎమ్మెల్యేల నుంచి చాలా మందే ఉన్నారు.

 

ఇక వైసీపీ ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ‌కృష్నం రాజు తాను ఎంపీగా ఉన్నా కూడా ట్రాక్ట‌ర్ ఇసుక ఇప్పించ లేక‌పోతున్నాన‌ని చెప్పారు. ఇక డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మామ చంద్ర‌శేఖ‌ర్ రాజు సైతం ఈ ప‌ద‌వులు ఉండి కూడా ఉప‌యోగం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక ఇప్పుడు ఈ లిస్టులోకి మ‌రో ఎమ్మెల్యే చేరిపోయారు. ఆయ‌నే తూర్పు గోదావ‌రి జిల్లా కొత్త‌పేట ఎమ్మెల్యే చిర్ల జ‌గ్గిరెడ్డి.

 

రావుల‌పాలెంలో ఎస్ఈబీ స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ ఏపీఎండీసీ ఇసుక పంపిణీ విష‌యంలో తీవ్రంగా విఫ‌ల‌మైంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కోన‌సీమ చుట్టూ ఇసుక ఉన్నా మాకు మాత్రం ఇసుక లేద‌ని ఫైర్ అయ్యారు. ఇక్క‌డ 10 ర్యాంపులు ఉన్నా ఒక్క‌టి ప్రారంభించ‌లేద‌ని.. ఇదంతా అధికారుల వైఫ‌ల్య‌మే అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏదేమైనా వైసీపీలో రోజు రోజుకు అస‌మ్మ‌తి గ‌ళాలు పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: