హైద‌రాబాద్  రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత సంచ‌రించ‌డం అక్క‌డి ప్ర‌జ‌ల్లో తీవ్ర క‌ల‌క‌లాన్ని రేపుతోంది. జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో కూడా చిరుత సంచ‌రిస్తున్న‌ట్లు ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఓ ఫాంహౌస్ కాంపౌండ్‌లోకి చిరుత ప్రవేశించిన దృశ్యాలు, చిరుత కిటికీ ఎక్కి ఇంట్లోకి తొంగిచూస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. స్థానికులు ఎవరూ బయటకు రావొద్దని ఇప్ప‌టికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఫాంహౌస్‌ వద్ద మరో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత క‌ద‌లిక‌లను గ‌మ‌నించ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు. అలాగే దాన్ని బంధించేందుకు బోన్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు అట‌వీశాఖ అధికారులు తెలిపారు. 

 

ఇదిలా ఉండ‌గా నాలుగు వారాల క్రితం బద్వేల్ సమీపంలో నడిరోడ్డుపై కనిపించిన చిరుత.. ఓ లారీ యజమానిపై దాడి చేసి పారిపోయిన విష‌యం తెలిసిందే. చిరుత‌ను బంధించేందుకు అటవీ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిరుత పాదముద్రల ఆధారంగా అది చిలుకూరు అటవీప్రాంతంలోకి వెళ్లి ఉంటుంద‌ని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. తాజాగా చిరుత మరోసారి ప్రత్యక్షం కావడంతో అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు ఉండ‌టం లేదు. చిరుత ఏం స‌మ‌యంలో ఎవ‌రిపై దాడి చేస్తుందోన‌న్న టెన్ష‌న్ నెల‌కొంది. అయితే రాజేంద్ర‌న‌గ‌ర్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన చిరుత‌...గ‌తంలో బ‌ద్వేల్‌లో దాడి చేసిన‌దేనా..? మ‌రి ఇది కొత్త‌దా అన్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

 

 అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు  జనావాసాల్లోకి రావడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. ఇటీవల కాలంలో వరుసగా చిరుతలు జ‌నావాస‌ల్లోకి రావ‌డం ఎక్కువైంది. మూడు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ శివారు అటవీ ప్రాంతంలో కూడా చిరుత సంచ‌రించ‌డం గ‌మ‌నార్హం.  ఇసాయిపేట‌లో అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్లిన మేకల గుంపుపై ఆదివారం సాయంత్రం చిరుత పులి దాడి చేసింది. మేక‌ను చంపి ఆహారంగా మార్చుకుంది. అలాగే  మ‌రో మేక కూడా గాయపడి మృతి చెంద‌డం గ‌మ‌నార్హం. దీంతో అక్క‌డి వారు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇప్పుడు రాజేందర్ నగర్ లో మరోసారి చిరుత కనిపించడంతో ప్రజలు భయంతో వణికి పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: