మాజీ మంత్రి అచ్చెన్నాయుడి కేసులో అర్ధరాత్రి అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. 3 రోజుల అవినీతి నిరోధక శాఖ  కస్టడీలో భాగంగా ఆస్పత్రిలోనే అచ్చెన్నాయుడు ను ప్రశ్నించాలని కోర్టు ఆదేశాలివ్వగా అర్ధరాత్రి ఆయన్ను డిశ్ఛార్జికి యత్నించడం వివాదం రేపింది. తాము గట్టిగా నిలదీయటంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు అచ్చెన్నాయుడి న్యాయవాది తెలిపారు.

 

 

ఈఎస్​ఐ మందుల కొనుగోలు కేసులో అరెస్ట్ అయ్యి అనారోగ్యంతో గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చికిత‌్స పొందుతున్నమాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి డిశ్చార్జి‌ చేసేందుకు యత్నించండం వివాదాస్పదమైంది. అచ్చెన్నాయుడిని నేటి నుంచి ఈ నెల 27వరకూ అవినీతి నిరోధక శాఖ కస్టడీకి ఇస్తూ విజయవాడ న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆసుపత్రి కే వెళ్లి ప్రభుత్వ డాక్టర్, లాయర్ సమక్షంలోనే వివరాలు సేకరించాలని అనిశాకు నిర్దేశించింది. అనారోగ్య కారణాలరీత్యా విచారణ సమయంలో అచ్చెన్నాయుడు మంచం మీదే ఉండి సమాధానాలివ్వొచ్చని, ఆయన్ను కూర్చోమని గాని, నిలుచోమనిగాని అడిగి ఇబ్బంది పెట్టొద్దని కోర్టు స్పష్టం చేసింది. అచ్చెన్నాయుడిని డిశ్చార్జి చేసేందుకు మరో మూడు నాలుగు రోజులు పడుతుందని గుంటూరు జనరల్‌ ఆస్పత్రి వైద్యులు సమర్పించిన నివేదికను పరిశీలించిన తర్వాతే కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

 

 

అయితే ఆస్పత్రి వర్గాలు రాత్రి అనూహ్యంగా అచ్చెన్నను డిశ్చార్జ్ చేసేందుకు యత్నించారని ఆయన న్యాయవాది హరిబాబు ఆరోపించారు.  ఈ విషయం  ఆర్​ఎంవోకి తెలియడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. డిశ్ఛార్జి రద్దైందని న్యాయవాదికి నచ్చజెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: