భారత ఐటీ నిపుణులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పెద్ద దెబ్బకొట్టారు. హెచ్‌-1బీ సహా వివిధ రకాల ఉద్యోగ వీసాలను ఈ ఏడాది డిసెంబరు 31 వరకు జారీ చేయకూడదని ఉత్తర్వులిచ్చారు.  త్వరలో అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కోబోతున్న ట్రంప్‌.. స్థానికులను ఆకట్టుకోవడంలో భాగంగానే ఈ ఉత్తర్వులను తీసుకొచ్చారని భావిస్తున్నారు. ఆయన నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఉత్తర్వులతో అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులందరిపై, ప్రధానంగా భారతదేశ ఐటీ నిపుణులపై ప్రభావం పడుతుంది. అమెరికాకు హెచ్‌-1బీ వీసాలపై వచ్చి, కాల పరిమితి అనంతరం వాటిని పునరుద్ధరించుకోవాల్సి ఉన్నవారికి తాజా ఉత్తర్వులు శరాఘాతమే. కొత్తగా గ్రీన్‌కార్డుల జారీనీ నిషేధించారు.

 

 

ట్రంప్‌ తాజా ఆంక్షల ప్రభావం హెచ్‌-1బీపై మాత్రమే కాకుండా ఇంకా పలు వీసాలపై ఉంటుంది. అయితే అమెరికా వెలుపల ఉంటూ, చెల్లుబాటయ్యే నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా లేనివారికి, ఇతరత్రా అధికారిక ప్రయాణ పత్రాలు లేనివారికి మాత్రమే కొత్త నిబంధనలు వర్తిస్తాయి. పాస్‌పోర్టులో వీసా స్టాంపింగ్‌ పూర్తయి విదేశాల్లో ప్రయాణాల్లో ఉన్నవారికి ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఉంటుంది. ఏ వీసాదారులపై ప్రభావం ఎలా ఉంటుందంటే..

 

 

వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని అమెరికా కంపెనీలు తమ ఉద్యోగులుగా నియమించుకునేందుకు హెచ్‌-1బీ వీసా వీలు కల్పిస్తుంది. ఈ ఏడాది అక్టోబరు ఒకటో తేదీ నుంచి మొదలయ్యే 2021 ఆర్థిక సంవత్సరం కోసం ఇప్పటికే అమెరికా, భారత్‌లకు చెందిన పలు కంపెనీలు హెచ్‌-1బీ వీసాలను జారీ చేశాయి. తాజా నిర్ణయం వాటన్నింటిపైనా పడనుంది. ఇలా వీసాలు పొందినవారు కనీసం ఈ ఏడాది చివరి వరకు నిరీక్షించాల్సిందే. ఆ తర్వాతే స్టాంపింగ్‌ నిమిత్తం ప్రయత్నించాల్సి వస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: