సెల్​ ఫోన్ చోరీకి ఆ ముఠా చిన్న పిల్లను ఉపయోగించుకుంది. వారికి 100 రూపాయలు ఇచ్చి ఆ పిల్లలతో సెల్​ఫోన్ చోరీ చేయించేది. ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.8 లక్షల విలువైన ఫోన్లు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.పిల్లలను ఉపయోగించుకొని సెల్ ఫోన్లు చోరీలు చేస్తున్న ఓ ముఠాను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.8 లక్షల విలువైన 45 సెల్‌ఫోన్లు, ఆటో, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

 

 

 తెలంగాణ మాదాపూర్‌లో సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ వెంకటేశ్వరరావు, మాదాపూర్‌ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు వివరాల ప్రకారం...కర్నూల్‌ జిల్లా నంద్యాల పట్టణం విజయనగర్‌ కాలనీకి చెందిన నాగలురి చిన్నా అలియాస్‌ హరిప్రసాద్‌(30) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2015లో కర్నూలులో రెండు సెల్‌ఫోన్లు చోరీ చేసి పట్టుబడి జైలుకు వెళ్లాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగికి చెందిన అనకాల కిషోర్‌(25)తో కలిసి పలుమార్లు సెల్‌ఫోన్లు దొంగలించాడు. 

 


 
గత జనవరిలో హరిప్రసాద్‌, కిషోర్‌ ముత్తంగికి వచ్చి గది అద్దెకు తీసుకొన్నారు. గత ఫిబ్రవరిలో సమ్మక్క సారక్క జాతరకు వెళ్లి అక్కడ సెల్‌ఫోన్లు చోరీ చేయడంతో జమ్మికుంట పోలీసులు జైలుకు పంపించారు.మార్చి 13న జైలు నుంచి బయటకు వచ్చిన వీరు ఒక ఆటో, మూడు ద్విచక్రవాహనాలను సెకండ్‌హ్యాండ్‌లో కొనుగోలు చేశారు. తాండూరుకి చెందిన పుసల శ్రీనివాస్‌(55)తో కలిసి చోరీలు ప్రారంభించారు. ఇందుకోసం కర్నూల్‌కు చెందిన ఇద్దరు బాలురను తీసుకొచ్చారు. జనసమర్థం ఉన్నచోట్ల ఖరీదైన సెల్‌ఫోన్‌ ఉన్న వ్యక్తిని ఎంపిక చేసుకొని నిందితులు మాటల్లో పెడతారు. 

 

 

చిన్నారులు అదును చూసి చరవాణులు తస్కరించి మాయమవుతారు. ఇందుకు చిన్నారులకు భోజనం పెట్టి రోజుకు రూ.100 ఇస్తున్నారు. ఇలా ముఠా సభ్యులు పలు ప్రాంతాల్లో రోజూ మూడు నుంచి నాలుగు చరవాణులు దొంగిలించారు.ఈ నెల 20న నార్సింగి ఠాణా పరిధిలోని వైఎస్‌ఆర్‌ కాలనీలో ప్రకాష్‌ మార్కెట్‌కు వెళ్లగా అతని నుంచి రూ.15వేలు విలువైన ఫోను కొట్టేశారు. 21న నార్సింగిలోని ఓ హోటల్‌లో లక్ష్మణ్‌ టీ తాగుతుండగా రూ.20వేలు ఖరీదైన ఫోన్‌ను మాయం చేశారు. నార్సింగి పోలీస్‌ క్రైమ్‌ బృందం అనుమానితులపై నిఘా పెట్టి గురువారం నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.

 

 

 ప్రధాన నిందితులు ముగ్గురిని రిమాండ్‌కు పంపించగా ఇద్దరు బాలురను జువనైల్‌ హోమ్‌కు తరలించారు. హరిప్రసాద్‌పై గతంలో 4, శ్రీనివాస్‌పై 8, కిశోర్‌పై 2 దొంగతనాల కేసులు ఉన్నట్లు జాయింట్‌ సీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: