వివిధ అవసరాల కోసం దిగుమతి చేసుకొనే 350 రకాల వస్తువులపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిల్లో ఎలక్ట్రానిక్‌, టెక్స్‌టైల్స్‌, బొమ్మలు, ఫర్నిచర్‌ వంటివి ఉన్నాయి. దేశీయ సంస్థలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయా వస్తువుల దిగుమతి అవసరాలను పరిశీలించేందుకు ఓ మానిటరింగ్‌ వ్యవస్థని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ వ్యవస్థ అత్యవసరమైన వాటిని మాత్రమే పరిశీలించి లైసెన్స్‌ ఇస్తుంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌కు ఊతమిచ్చేలా ఈ వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక, వాణిజ్య, మైక్రో, ఎంఎస్‌ఎంఈ, నీతి ఆయోగ్‌ వీటిపై పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఆంక్షలు విధించాలని భావిస్తున్న వస్తువుల్లో అత్యధిక భాగం చైనా నుంచి దిగుమతి అయ్యేవే. వీటి విలువ ఏటా 127 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటోంది.

 


మరోపక్క భారత్‌లో తయారు చేసే వస్తువులు మంచి నాణ్యతతో ఉండేట్లు ప్రమాణాలను సిద్ధం చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ దీనిపై పనిచేస్తోంది. ప్రస్తుతం ఆంక్షల పరిధిలోకి రావచ్చని భావిస్తున్న వాటిల్లో వస్త్రాలు, తోలు వస్తువులు, బొమ్మలు, ఫర్నిచర్‌ వంటి వాటితోపాటు ఔషధాలు, టీవీలు, ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు వంటివి ఉన్నాయి. ఈ విధానం అమల్లోకి వస్తే ఎంతమొత్తంలో, ఎంత విలువైనవి, ఏ దేశంలో తయారైనవి అనే కచ్చితంగా రిజిస్టర్‌ చేయనున్నారు. ఇప్పటికే స్టీల్‌ దిగుమతులపై ఇటువంటి విధానాన్నే అమలు చేస్తున్నారు. దీనిని స్టీల్‌ ఇంపోర్ట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ అంటారు. గతనెలలోనే టైర్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: