వేదాంత లిమిటెడ్‌ అధినేత అనిల్‌ అగర్వాల్‌ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు కీలక సూచనలు చేశారు. దేశంలో దాగి ఉన్న వనరులను వెలికి తీయాలని, ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని, ఆధార్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ.2లక్షల చొప్పున రుణం ఇవ్వాలని సూచించారు.

దీనివల్ల ప్రభుత్వరంగ సంస్థలు 3 రెట్లు గొప్పగా పనిచేయగలవన్నారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించొచ్చని, ఉద్యోగాలను సృష్టించొచ్చని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగాసూచించారు. భారత పరిస్థితిని ‘మదర్‌ ఇండియా’ సినిమాతో పోల్చారు. ‘‘ఆ సినిమాలో రైతు 100 క్వింటాళ్ల ధాన్యం పండిస్తే 80 క్వింటాళ్లను రుణమిచ్చిన వారు పట్టుకుపోతారు.

అలాగే, భారత్‌లోనూ 50% ఆదాయాలను దిగుమతులపైనే ఖర్చు చేస్తున్నాం. ఆ తర్వాత వడ్డీలకు చెల్లింపులు పోగా మిగిలేది ఏమీ లేదు’’ అని అగర్వాల్‌ పేర్కొన్నారు. సహజవనరులు, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు భారీ ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యాలున్నట్టు చెప్పారు. మినరల్స్, ఆయిల్, గ్యాస్‌ నిక్షేపాలను మరింత పెద్ద ఎత్తున వెలికితీయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: