ఏదైనా రంగంలో కష్టిస్తే, ప్రత్యేక గుర్తింపు వస్తుందనే తపన జయప్రదారెడ్డి గారిని సేంద్రియ కోళ్ల రైతుగా మార్చింది. రసాయనిక ఔషధాలు, వాక్సిన్లు వాడకుండా లేయర్‌ కోళ్లను ఆరోగ్యదాయకంగా పెంచుతున్నారామె. చిరుధాన్యాలతో తయారు చేసుకునే దాణాలో , కూరగాయలు, ఆకులు అలములు కలిపి కోళ్లకు మేపుతున్నారు.

ఇందుకోసం రెండున్నర ఎకరాల్లో ఔషధ మొక్కలు, చెట్లు, పందిరి కూరగాయలు పెంచుతున్నారు. అత్యంత నాణ్యమైన 'సేంద్రియ గుడ్ల'ను ఉత్పత్తి చేస్తూ అద్భుతమైన లాభాలు పొందుతున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రాణిపేట ఆమె స్వగ్రామం. భర్త జనార్దన్‌రెడ్డి గతంలో జైళ్లవిభాగంలో హైదరాబాద్‌లో పనిచేసి డీఎస్పీగా రిటైరయ్యారు.

రాణిపేటలోని సొంత భూమిలో షెడ్లు నిర్మించి, గుడ్లు పెట్టే కోళ్ల ఫారాన్ని ప్రారంభించారు. అక్కడే 15 వేల కోళ్లను పెంచుతున్నారు. కోడిపిల్లల పెంపకంలో, మొక్కజొన్న, జొన్న, రాగులు, సజ్జలు తదితరాలతో కూడిన దాణా ఇచ్చే వారు. అల్లం వెల్లుల్లి గుజ్జు కూడా అడపా దడపా వేస్తున్నారు. ధర తక్కువగా ఉన్నప్పుడు టమాటా, ఉల్లిపాయలు, సొరకాయలు వంటి కూరగాయలను రోజూ ఉదయం చాఫ్‌ కట్టర్‌తో ముక్కలు చేసి.. గ్క్రెండర్‌లో వేసి డ్రైఫీడ్‌తో కలగలిపి.. రోజుకు రెండు సార్లు కోళ్లకు మేపుతున్నారు.

ఎకరంన్నర భూమిలో ప్రత్యేకంగా సొర పాదులు పెంచి.. ఆ కాయలను కోళ్లకు వినియోగిస్తున్నారు. ఎండాకాలం కాబట్టి రోజుకు 150 నిమ్మకాయల రసం దాణాలో కలుపుతున్నారు. యాంటిబయాటిక్స్‌ గాని, ఇతర రసాయనిక ఔషధాలు గానీ కోళ్లకు వాడాల్సిన అవసరమే రాలేదని ఆమె అన్నారు. ఇవి పెట్టే గుడ్డు సాఫ్ట్‌గా, నీచు వాసన లేకుండా, రుచిగా ఉంటున్నాయని వినియోగదారులు అంటున్నారు.

'జయ హెర్బల్‌ ఎగ్స్‌' బ్రాండ్‌ పేరుతో ఆమె గుడ్లను విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌, కర్నూలులోని అనేక మాల్స్‌ వారు వచ్చి తీసుకెళ్తున్నారు. ఈ గుడ్లు 20 రోజుల వరకు నిల్వఉంటాయి. రసాయన రహితంగా గుడ్లను ఉత్పత్తి చేస్తున్న ఆమె ఆదర్శప్రాయురాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: