ఔను. ఫోన్ బంగారంతో చేసిందే. ఇది ఎక్క‌డో కాదు. హైద‌రాబాద్‌లోనే. ఈ ఫోన్ కొనుగోలు చేసిన త‌ర్వాత మీరు ఓ మంచి ప‌నికి స‌హాయం కూడా చేయ‌వ‌చ్చు. అదే దాతృత్వ సంస్థ‌ల‌కు స‌హాయ‌ప‌డ‌టం.... కాస్త వివ‌రంగా చెప్పండి అంటారా? ఇదిగో ఆ వివ‌రాలు....చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ..లిమిటెడ్ ఎడిషన్‌గా కే20 ప్రొను బంగారంతో తయారు చేసింది. డైమండ్లు, పసిడి ప్యానెల్‌తో తయారు చేసిన ఈ ఫోన్ ధర రూ.4.80 లక్షలని కంపెనీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ తెలిపారు.  100 గ్రాముల బంగారం కలిగిన ఈ మొబైల్‌ను కేవలం 20 యూనిట్లు మాత్రమే తయారు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ 20 ఫోన్లను బహిరంగ మార్కెట్లో వేలం వేసి ఇలా వచ్చిన ఆదాయాన్ని దాతృత్వ సంస్థలకు ఇచ్చే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు. వీటిని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తారా లేదా అనే దానిపై సంస్థ ఇంకా నిర్ణయం తీసుకోలేదని జైన్ స్పష్టంచేశారు. 


ఇటీవల దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన రెడ్మీ కే20, కే20 ప్రొ మొబైళ్లను రాష్ట్ర మార్కెట్లోకి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఐదేళ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా మొబైళ్లను రూపొందించి సత్ఫలితాలను పొందినట్లు, గడిచిన రెండేళ్ల‌గా స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో మొదటి స్థానంలో నిలిచినట్లు చెప్పారు. అలాగే కంపెనీకి చెందిన మొబైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి దేశీయంగా ఏర్పాటు చేసిన ఏడు అసెంబ్లింగ్ మొబైల్ ప్లాంట్లలో ప్రతి సెకన్‌కు మూడు ఫోన్లు తయారు చేస్తున్నప్పటికీ డిమాండ్‌కు అందుకోవడం లేదని చెప్పారు. ప్రస్తుతం 55 శాతం నుంచి 60 శాతం లోపు మొబైళ్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తుండగా, మిగతావి రిటైల్ అవుట్‌లెట్లలో అమ్ముడవుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి 50:50 చేరుకోనుందన్నారు. 6జీ+128జీబీ మెమొరీ కలిగిన రెడ్మీ కే20 ప్రొ ధరను రూ.27,999గా నిర్ణయించిన సంస్థ.. 8జీబీ+ 256 జీబీ మెమొరీ మోడల్ రూ.30,999గా నిర్ణయించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: