ఇప్పటికే టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో సంస్థ, నేడు జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో భాగంగా తమ సంస్థ నుండి రాబోయే పలు నూతన పధకాల గురించి ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ కాసేపటి క్రితం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏడాది కాలంగా భారత ప్రజలు ఎదురుచూపులు చూస్తున్న రిలయన్స్ జియో గిగా ఫైబర్ ను సెప్టెంబర్ 5 నుండి అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సెప్టెంబరు 5 నాటికి జియో ఆవిష్కరించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజున జియో ఫైబర్‌ సేవలను కమర్షియల్‌ బేసిస్‌లో ప్రారంబించేలా తమ సంస్థ ఏర్పాట్లు చేసిందని ఆయన అన్నారు. 

ఇకపోతే రాబోయే అతి కొద్దిరోజుల్లో దేశవ్యాప్తంగా 1600 నగరాల్లోని 2కోట్ల ఇళ్ళు మరియు1.5కోట్ల వ్యాపార సముదాయాలకు తమ జియో గిగా ఫైబర్‌ను అందించాలనేది తమ ముందున్న లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక జియో ఫైబర్‌ ద్వారా 100 ఎంబీపీఎస్‌ నుంచి 1 జీబీపీఎస్‌ వరకు డేటాతో పాటు, సామాన్యులకి సైతం ఎంతో అందుబాటులో ఉండేలా జియో ఫైబర్‌ ధరలను నెలకు రూ. 700 నుంచి రూ. 10వేల వరకు నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు. అంతేకాక ప్రీమియం జియో ఫైబర్‌ కస్టమర్లు, తమకు ఇష్టమైన సినిమాలను విడుదలైన రోజే తమ ఇంట్లో ఆనందంగా వీక్షించవచ్చని, అయితే ‘జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’గా పిలిచే ఈ సేవలను 2020 ద్వితీయార్ధం తరువాత మాత్రమే అందుబాటులోకి తీసుకురవడం జరుగుతుందని అయన తెలిపారు. ఇక జియో ఫైబర్‌ ద్వారా భారత్‌లోని ఏ టెలికాం ఆపరేటర్‌కైనా మన ఇంటి నుంచే ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ జీవితకాలం చేసుకోవచ్చని అన్నారు. 

ఇక అన్నిటికంటే ముఖ్యంగా ప్రారంభ ఆఫర్‌ కింద ఫరెవర్ వార్షిక ప్లాన్‌ తీసుకునే జియో ఫైబర్‌ కస్టమర్లు హెచ్‌డీ/ 4కే ఎల్‌ఈడీ టీవీ మరియు సెట్‌టాప్‌ బాక్సును ఉచితంగా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేసారు. అయితే ఈ ప్రకటనతో ఇప్పటికే ఉన్న డిటిహెచ్ ఆపరేటర్ల వెన్నులో వణుకుపుట్టినట్లు సమాచారం. ఇప్పటికే టెలికాం రంగంలో ప్రవేశించి అత్యధిక మంది ప్రజలను ఆకర్షించిన రిలయన్స్ జియో, ఇకపై గిగా ఫైబర్ సేవలతో మరింతగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లే అవకాశం లేకపోలేదని అంటున్నారు టెక్ నిపుణులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: