కొన్నాళ్ల క్రితం వరకు ఒక జిబి మొబైల్ ఇంటర్నెట్ డేటాని దాదాపుగా రెండు నుండి మూడు వందల రూపాయలకు కొనుగోలు చేసిన మనము, నేడు అదే ఒక జిబి డేటాని ఒక రూపాయి కంటే తక్కువ ధరకు పొందగలుగుతున్నాం అంటే, అది నిజంగా రిలయన్స్ జియో రాక వల్లనే సాధ్యం అయిందని చెప్పవచ్చు. ఇక టెలికాం రంగంలోకి జియో రంగ ప్రవేశం తరువాత మిగతా ఆపరేటర్లు కూడా ధరలు తగ్గించి మెట్లు దిగిరాక తప్పలేదు. అయితే అంతటితో ఆగని జియో ప్రయాణం, ఆ తరువాత జియో గిగా ఫైబర్ పేరుతో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్, డిటిహెచ్, వాయిస్ కాలింగ్ వంటి మూడు సాకర్యాలను రాబోయే రోజుల్లో మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని, అప్పట్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చెప్పడం జరిగింది. ఇక చెప్పిన విధంగా సరిగా మూడేళ్ళ తరువాత ఇటీవల ఆగష్టు 12న జరిగిన వారి కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో జియో గిగా ఫైబర్ ను లాంచ్ చేసారు అంబానీ. అయితే వాటి పూర్తి వివరాలు మాత్రం సెప్టెంబర్ 5న ప్రకటిస్తామని ఆయన చెప్పడం, ఇక వారు చెప్పిన విధంగా మొన్న గిగా ఫైబర్ యొక్క ప్లాన్స్  వెల్లడించడం జరిగింది. 

అయితే అనుకున్న దొక్కటి, అయినది మరొక్కటి అనే చందాన, ఎప్పటినుండో జియో గిగా ఫైబర్ కోసం ఎదురుచూడ సాగిన లక్షలాది కస్టమర్లు, మొన్న ఆ సంస్థ ప్రకటించిన ప్లాన్స్ చూసి పూర్తిగా నీరు గారిపోయారు. అయితే అందుకు కొన్ని ముఖ్య కారణాలున్నాయి. ముందుగా జియో ఎంజీఎంలో చెప్పినట్లు బ్రాడ్ బ్యాండ్, డిటిహెచ్, వాయిస్ కాల్స్ వంటివి రూ. 700 మొదలు రూ. 10000 వరకు ఉంటాయని తెలిపారు అంబానీ. ఇక మొన్న ప్రకటించిన ప్లాన్స్ ప్రకారం రూ. 699, రూ. 849, రూ. 1299, రూ. 2499, రూ. 3999, రూ. 8499 గా ధరలు నిర్ణయించడం జరిగింది. అలానే వీటికి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం గా పేర్లు కూడా నిర్ణయించారు. ఇక ముందుగా గిగా ఫైబర్ ప్రకటన సమయంలో ఎవరైతే సంవత్సర చందా చెల్లించి గిగా ఫైబర్ సేవలు తీసుకుంటారో, అటువంటి వారికి 4కె డిజిటల్ స్మార్ట్ టీవీని ఉచితంగా అందిస్తాం అని అంబానీ ప్రకటించారు. కానీ ఈ ప్లాన్స్ లో కేవలం డైమండ్ ప్లాన్ కు పైబడిన ప్లాన్స్ ను తీసుకునే కస్టమర్స్ కు మాత్రమే ఈ సదుపాయం అందించనున్నారు. 

అదీకాక డైమండ్ ప్లాన్ వారు ఒకవేళ టివి తీసుకుందాం అని సిద్దమయినప్పటికీ, వారు రెండు సంవత్సరాల చందా ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక మరొకటి ఫస్ట్ డే ఫస్ట్ షో, ఇది కూడా డైమండ్ సర్వీస్ కు పైపడి ప్లాన్స్ తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. అయితే ఈ సర్వీస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేది మాత్రం రాబోవు ఏడాది ద్వితీయార్ధంలో అని అంబానీ తన ఎంజీఎంలో చెప్పారు. ఇకపోతే అన్నిటికంటే జియోకు బాగా దెబ్బేసిన అత్యంత ముఖ్యమైన రెండు అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది డిటిహెచ్ బాక్స్, మనం జియో వారి బ్రాంజ్ నుండి టైటానియం వరకు ఎటువంటి ప్లాన్ ఎంచుకున్నప్పటికీ మనకు బ్రాడ్ బ్యాండ్, డిటిహెచ్, వాయిస్ కాల్స్ వంటివి ఆయా ప్లాన్స్ ప్రకారం అందించడం జరుగుతుంది. అయితే ఇందులోనే అసలు మర్మం దాగి ఉంది, అదేమిటంటే, మనకు ఇచ్చే డిజిటల్ సెట్ టాప్ బాక్షు కేవలం హై ఎండ్ గేమ్స్ ఆడుకోవడానికి అలానే ప్లాన్స్  ను బట్టి ఓటిటి ప్లాట్ ఫామ్స్ (నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్) లోని కార్యక్రమాలు వీక్షించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప, మనం ఇంట్లో రోజువారీ చూసే ఛానల్స్ ఇందులో లభ్యం కావని సమాచారం, అయితే జియో వారి సావన్, జియో సినిమా వంటివి మాత్రం మనం ఎంచుకున్న ప్లాన్స్ ప్రకారం అందించడం జరుగుతుందట. 

ఇక మరొక ముఖ్యమైన అంశం ఇంటర్నెట్ స్పీడ్. ఇప్పటివరకు యాక్ట్, బిఎస్ఎన్ఎల్ వంటి బ్రాండ్ బ్యాండ్ ఆపరేటర్లు ప్రకటించిన ఇంటర్నెట్ టారిఫ్ ప్లాన్స్ తో పోలిస్తే, జియో ప్రకించిన ఇంటర్నెట్ టారీఫ్స్ అత్యంత దారుణంగా ఉన్నాయి. సిల్వర్ ప్లాన్ నుండి టైటానియం వరకు కొంత లిమిటెడ్ గా మాత్రమే డేటాను అందించనుంది జియో, ఆపై ఆరు నెలల తరువాత ఆయా ప్లాన్స్ లో అదనంగా అందించే డేటా తగ్గపోతుందని సంస్థ తెలిపింది. ఇక ఇంటర్నెట్ స్పీడ్ 100 ఎంబిపిఎస్ నుండి 1 జిబిపిఎస్ వరకు ఉంటుందని ప్రకటించిన జియో, మనం తీసుకున్న ప్లాన్స్ ప్రకారం డేటా అయిపోతే లభించే పోస్ట్ ఎఫ్యూపి, కేవలం 1 ఎంబిపిఎస్ గా ప్రకటించడం పై చాలామంది పెదవి విరుస్తున్నారు. కాబట్టి, ఈ విధమైన పలు రకాల లోపాల కారణంగా జియో గిగా ఫైబర్, సాధారణ మధ్యతరగతి వారి ఆశలకు చాలావరకు గండి కొట్టిందని, అయితే రాబోయే రోజుల్లో ప్లాన్స్ ను కొంత సవరించి కనుక అందించినట్లైతే జియోకు కస్టమర్లు కొంత ఆకర్షితులయ్యే అవకాశం ఉందని అంటున్నారు టెక్ నిపుణులు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: