భారతీయ ఆటోమొబైల్ రంగానికి గడ్డుకాలం ఎదురైంది. దేశీయ ఆటో పరిశ్రమ మరింత కుదేలవుతోంది. గతేడాది వరకు జిగేల్ మన్న ఆటో రంగం ఇప్పుడు చతికిలపడింది. అమ్మకాలు తగ్గిపోయాయి.. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. వందలాది డీలర్‌షిప్‌లు మూతపడ్డాయి. అసలెందుకీ పరిస్థితి వచ్చింది. ఆటో మొబైల్ రంగానికేమైంది ?


నిన్న మొన్నటిదాకా జిగేల్ మన్న ఆటోమొబైల్ రంగానికి ఆటుపోట్లు ఎదురయ్యాయి. అమ్మకాలు గణనీయంగా తగ్గాయి... సీజన్ ఏమాత్రం కలిసిరాలేదు. ఆటో రంగంలో ఉద్యోగాల కోత మొదలయింది. ప్రోడక్షన్‌, మ్యానుఫ్యాక్చరింగ్ లో లక్షలాది మంది జాబ్‌లు కోల్పోయి రోడ్డు నపడ్డారు. వీటికితోడు... చుక్కలనంటిన చమురు ధరలు సైతం.. ఆటోమొబైల్ రంగాన్ని నష్టాల ఊబిలోకి నెట్టాయి. వరుసగా పదవ నెలలో కూడా అమ్మకాలు భారీగా పడిపోయాయి. నెలవారీ ప్యాసింజర్‌ వాహనాలు, ఇతర కార్ల అమ్మకాలు  దారుణంగా పడిపోయాయి.  భారతీయ ఆటోమొబైల్‌ ఉత్పత్తుల అసోషియేషన్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత మాసంలో  రికార్డు క్షీణతను నమోదు చేశాయి.


2017 డిసెంబర్ వరకు లాభాల్లో ఉన్న ఆటో మొబైల్ రంగం... ఈ ఏడాది ఊహించని విధంగా 30 శాతం నష్టాల బాట పట్టింది. ఈ ఏడాది జాతీయ ఈక్విటీ మార్కెట్ ఇండెక్స్‌లో... అన్ని రంగాలకంటే ఆటోమొబైల్ రంగానిదే వీక్ పెర్ఫార్మెన్స్. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌ను ఏలుతున్న మారుతి సుజూకీ ఇండియా లిమిటెడ్, హీరో మోటోకార్ప్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ట్రక్, బస్సు అమ్మకాలు 39 శాతం పడిపోయాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 22శాతం పడిపోయి.. 1.5 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. గత 16 నెలల్లో ఏకంగా ఏకంగా 42 మిలియన్ల డాలర్ల సంపదను ఆటోమొబైల్ రంగం కోల్పోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఒక్క జూలైలోనే.. ఆటో రంగంలో పని చేస్తున్న 2.3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని... మరో 10 లక్షల ఉద్యోగాలు కూడా పోనున్నాయని ఒక సంస్థ సంచలన విషయాలు బయటపెట్టింది. భారత్‌లో ఆటో మొబైల్ రంగం గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నట్టు సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మాన్యుఫ్యాక్చరర్స్ ఓ రిపోర్ట్ ఇచ్చింది. ప్యాసింజర్ వెహికిల్ కంపెనీలకు గత నెల కూడా కలిసి రాలేదు.


వాహనాలు కొనేవారి సంఖ్య తగ్గుతుండటం ఒక సమస్య అయితే... కొనేవారికి ఫైనాన్స్ దొరక్కపోవడం మరో సమస్య. ఆర్థిక వ్యవస్థ కూడా నెమ్మదించడం ఆటోమొబైల్ రంగంపై ప్రభావం చూపుతోంది. కొనుగోళ్లు తగ్గాయి.. డీలర్లు, మార్కెటింగ్ ఏజెంట్ల ఉద్యోగాల్లో కోత మొదలైంది.  అమ్మకాలు ఇలాగే తగ్గితే... కంపెనీలు మరింతగా పొదుపు చర్యలు పాటించవచ్చని... ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉంది. కంపెనీలు వ్యయాలను తగ్గించుకునే చర్యలకు ఉపక్రమిస్తే...  తయారీ విభాగంలో ఉండే తాత్కాలిక సిబ్బందిపై మొదటి వేటు పడుతుంది. ఆ తర్వాత ఆర్ అండ్ డి లేదా ప్రొడక్ట్ డెవలెప్ మెంట్ విభాగంలో ఉండే మధ్య నుంచి సీనియర్ స్థాయి ఉద్యోగుల కోత తప్పదు. ఆటో రంగానికి మంచి రోజులు రావాలంటే 7 నుంచి 8 నెలలు పట్టే అవకాశం ఉందంటున్నారు.  సెప్టెంబర్‌, అక్టోబర్‌ ఆటో రంగానికి కలిసొచ్చే నెలలు. సేల్స్‌తో బిజీగా ఉండాల్సిన షోరూమ్‌లు... ఇప్పుడు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. మందగమనం ఇలాగే కొనసాగితే మరింత సంక్షోభం తప్పదని పరిశ్రమ వర్గాలు ఆందోళనపడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: