ఉల్లికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరగటంతో,  కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. కేంద్ర గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన ఉల్లిని రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. మరోపక్క ఢిల్లీ, పంజాబ్‌ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లిని తక్కువ ధరలకు ప్రజలు అందిస్తున్నాయి. 
కొద్ది రోజులుగా ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. దేశ రాజధాని సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఉల్లి పాయల ధరలు 90 రూపాయలకు చేరుకున్నాయి. ఈ సమస్య సుమారు నెలరోజుల నుంచీ నెలకొన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ధరలు అదుపుచేసే చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది.


ఉల్లి పాయలు బహిరంగా మార్కెట్ లో కేజీ 90 రూపాయల వరకు పలుకుతోంది. కొన్ని రాష్ట్రాల్లో 100 మార్క్ ను కూడా అందుకుంది. ఉల్లి ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్రలో పండుతోంది. ఇటీవల వర్షాలతో అక్కడ పంటలు దెబ్బతిన్నాయి. దీనికి తోడు వ్యాపారులు కూడా ఇదే సమయం చూసుకుని సరుకుని దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రేట్లు పెరిగేందుకు పరోక్షంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఫలితంగా దేశవ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పడింది.  నాలుగేళ్లలో ఉల్లిధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. సాధారణంగా ఈ సీజన్ లో ఉండే ధర కంటే ఇది 90శాతం ఎక్కువ.


అయితే నవంబర్ నాటికి దాదాపు దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంట చేతికి వస్తుంది కాబట్టి, అప్పటికి ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఉల్లిధర అదుపు చేయటానికి కేంద్రం ఉల్లి ఎగుమతుల్ని తక్షణమే నిలిపివేసింది. కేంద్ర గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన 56 వేల టన్నుల ఉల్లిపాయల్లో తక్షణమే 16 వేల టన్నుల ఉల్లిపాయల్ని మార్కెట్లోకి విడుదల చేసింది. కేంద్ర సంస్థలైన నాఫెడ్, జాతీయ సహకార వినియోగదారుల ఫెడరేషన్, మదర్ డైయిరీ సఫాల్ ఔట్లెట్స్ ద్వారా ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కేజీ 22 నుంచి 23 రూపాయలకు అమ్ముతోంది. 


కేంద్రం వద్ద ఉల్లిపాయలు సరిపడా ఉన్నాయని, ఏ రాష్ట్రాలకైనా కావాలంటే తక్షణమే పంపిణీ చేస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్చేశారు. ఉల్లి కావాలన్న రాష్ట్రాలకు కేజీ రూ.16 రూపాయల చొప్పున కేంద్రం సప్లయ్ చేస్తోంది. వీటిని ఆయారాష్ట్రాలు రూ.24కి అమ్ముతున్నాయి.  ప్రస్తుతానికి మార్కెట్లో గత ఏడాది పండిన పంటనే సప్లయ్ చేస్తున్నారు. నవంబర్ నాటికి కొత్తవి మార్కెట్లోకి వస్తే ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని అంచనాలున్నాయి. 


ఉల్లి పాయల ఎగుమతులను నిషేధించిన కేంద్రం, స్వేచ్ఛా వాణిజ్యాన్ని రద్దు చేసింది. ఉల్లిపాయలను అంతర్జాతీయ మార్కెట్ లో విక్రయించడానికి వీల్లేకుండా వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు నిషేధం విధించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసి, తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: