అకాల వర్షాలు నిజామాబాద్ రైతులను నిండా ముంచేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వానలకు తడిసి మద్దవడంతో.. తల్లడిల్లిపోతున్నారు అన్నదాతలు. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియని రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.


పంట చేతికందే సమయంలో పడ్డ అకాల వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సోయా పంటలు తడిసిపోయాయి. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా 50 వేల ఎకరాల పైన వరిపంట దెబ్బతింది. దీంతో ఖరీఫ్ పంటల్లో మంచి దిగుబడి వస్తుందనుకున్న రైతులకు.. లాభాల మాట దేవుడెరుగు ? పెట్టుబడి చేతికొచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


జిల్లాలో అకాల వర్షాలతో జరిగిన నష్టంపై సర్వే చేపట్టారు అధికారులు. నష్టపోయిన రైతులు ఆవేదన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వానికి ఖచ్చితమైన రిపోర్టు ఇస్తామంటున్నారు అధికారులు. పంట పొలాల నష్టం అటుంచితే.. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం కూడా వర్షాలకు తడిసిపోయింది. దీంతో చేసేదేమి లేక వాటిని ఆరబోసుకుంటున్నారు రైతులు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు మిల్లర్లు. ప్రభుత్వమే ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు రైతులు. నిజామాబాద్, బాసర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.  


మరోవైపు.. ఉమ్మడి జిల్లాలో ఆరుతడి పంటల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. మొక్కజొన్న, వేరుశనగ, ఉల్లితో పాటు ఇతర పంట పొలాల్లో వర్షపు నీరు నిలవడంతో మొలక శాతం తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇలా అన్నదాతలకు మేలు చేస్తుందనుకున్న వర్షం కాస్తా.. రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: