ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతను వరుణుడు కష్టాల్లోకి నెట్టేశాడు. అప్పులతో రెక్కల కష్టం కలగలిపి పండించిన పంట నీళ్లపాలైంది. చేతికొచ్చిన వరిపంట తడిసిపోగా.. మిగిలిన పంటలు కూడా నాశనమయ్యాయి. దీంతో చేసేదేమి లేక ప్రభుత్వమే ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు రైతన్నలు.


అకాల వర్షం ఉమ్మడి నల్గొండలో వరి, పత్తి పంటలను నాశనం చేసింది. సుమారు 20 కోట్ల నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు వ్యవసాయశాఖ అధికారులు. యాదాద్రి జిల్లాలో ఏడు వేల ఎకరాల్లో వరి, 650ఎకరాల్లో పత్తి పంటలు మునిగిపోయాయి. ఇక సూర్యాపేట జిల్లాలో 27వేల హెక్టార్లలో పత్తి, నాలుగు వందల యాబై ఎకరాల్లో వరి పంటలకు నష్టం కలిగింది.


ధాన్యం తడవడంతో తేమ ఉందంటూ కొనేందుకు వెనకాడుతున్నారు మిల్లర్లు. దీంతో ఐకేపీ సెంటర్లలో ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు రైతులు. అక్కడ కూడా వర్షం పడి ధాన్యం తడిసిపోయింది. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనూ అదే పరిస్థితి. మంచిర్యాలలోని నాలుగు మండలాల్లో సుమారు రెండు వేల హెక్టార్లలో పంట నష్టం జరుగుతోంది. వరి నేలకంటుకుపోగా.. పత్తి, మిర్చి పొలాలు పనికి రాకుండా పోతున్నాయి. నిర్మల్ జిల్లాలో అకాల వర్షాల వల్ల సుమారు పదిహేను వేల ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా  వేశారు అధికారులు. 


బైంసా, ముధోల్ డివిజన్లలో విరివిగా పండించే సోయాకు అధిక నష్టం కలిగింది. సుమారు పది వేల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, నిర్మల్ డివిజన్‌లో సుమారు 3 వేల 5 వందల ఎకరాలలో  వరి పంట నష్టం జరిగినట్టు ఏఈవోలు అంచనా  వేశారు. అయితే రాష్ట్రంలో ఇంత నష్టం కలుగుతున్నా.. ప్రాధమిక అంచనా వేయడంలో విఫలమవుతున్నారు అధికారులు. నష్టం జరిగిన వెంటనే సర్వే చేయకపోవడంతో.. రైతులకు అందాల్సిన పరిహారం సరిగా అందడం లేదు. వరి, పత్తి పంటలతో పాటు ఆరుతడి పంటలకు కూడా ఇదే పరిస్థితి. ఆరంభంలో వర్షాలు లేవని ఆందోళన చెందిన రైతులకు.. అకాల వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: