గత వారం రోజుల్లో బంగారం ధరలు మూడోసారి తగ్గాయి. కొనుగోలుదారుల నుండి డిమాండ్ మందగించడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్ లో మంగళవారం 10 గ్రాముల బంగారం ధర 40 రూపాయలు తగ్గి 40,370 రూపాయలకు క్షీణించింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర 70 రూపాయలు తగ్గి 40,300 రూపాయలకు క్షీణించింది. 
 
విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలలో కూడా ధరలు ఇదే విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 70 రూపాయలు తగ్గి 36,940 రూపాయలకు క్షీణించింది. మంగళవారం వరకు స్థిరంగా కొనసాగిన వెండి ధర కూడా క్షీణించడం గమనార్హం. తయారీదారుల నుండి పరిశ్రమ యూనిట్ల నుండి డిమాండ్ మందగించటం వలన వెండి ధర తగ్గినట్లు తెలుస్తోంది. కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గటంతో వెండి ధర 48,700 రూపాయలకు దిగొచ్చింది. 
 
దేశీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పెరగడం గమనార్హం. అక్టోబర్ నెలలో ఆరేళ్ల గరిష్ట స్థాయి ఔన్స్‌కు 1,550 డాలర్లకు బంగారం ధర చేరింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర 0.31 శాతం పెరుగుదలతో 1,488.45 డాలర్లకు చేరగా వెండి ధర 0.17 శాతం పెరిగి 17.59 డాలర్లకు చేరింది. 
 
బంగారం ధరపై వడ్డీరేట్లు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలులాంటి అంశాలు ప్రభావం చూపుతాయి. అంతర్జాతీయ, దేశీయ పరిణామాలు కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: