అమెరికా - చైనా కొన్నాళ్లుగా వాణిజ్యయుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. చైనా, భారత్ వంటి దేశాలు అమెరికా వస్తువులపై భారీగా పన్ను లేస్తున్నాయన్నది ట్రంప్ ఆరోపణ. అందుకే అమెరికాలో దిగుమతయ్యే చైనా, ఇండియా దేశాల వస్తువులపైనా భారీగా పన్నులు వేయాలని ట్రంప్ నిర్ణయించారు. ఆ తర్వాత ఇదే తరహా ప్రతిదాడి చైనా నుంచి కూడా ఎదురైంది.


ఈ రెండు అగ్రదేశాల పన్నులు యుద్ధం చివరకు ఆర్థిక మాంద్యానికి కూడా దారి తీసిందన్న వాదనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ యుద్ధం విరమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ రెండు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది.


రెండు వారాలుగా ఇరు దేశాలకు చెందిన రాయబారులు నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నారని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ తెలిపారు. ఉత్పత్తులపై అదనంగా విధించిన సుంకాలను దశలవారీగా వెనక్కి తీసుకునేందుకు రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని చెప్పారు.


ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు సమాన నిష్పత్తిలో ఒకేసారి గతంలో విధించిన సుంకాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారట. ఒప్పందం చేసుకోవడానికి ఇదే ప్రధానమైన షరతు అని వెల్లడించారు. ఇరు దేశాధినేతలు త్వరలోనే ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే ప్రపంచ వాణిజ్యానికి ఇది మేలు చేసే అంశమే.


మరింత సమాచారం తెలుసుకోండి: