బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశం లోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్ కు ఝలక్ ఇచ్చింది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ ల్యాండ్ లైన్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ వినియోగదారులకు ఒక నెల పాటు ఉచితంగా బ్రాడ్‌ బ్యాండ్‌, వైఫై సేవలు అందించనున్నట్లు సంస్థ సీఎఫ్‌ఏ (కన్జ్యూమర్‌ ఫిక్స్‌డ్‌ యాక్సిస్‌) ఎండీ (దిల్లీ) వివేక్‌ బాంజల్‌ తెలిపారు. 


ల్యాండ్‌ లైన్‌ వినియోగదారులు అయిదు నిమిషాలకు పైబడి అవుట్‌గోయింగ్‌ కాల్‌(ఏ ఫోన్‌కు చేసినా) మాట్లాడితే తామే 6 పైసలు ఎదురిస్తామని..అలా ఎన్నికాల్స్‌ 5 నిమిషాలు మించి మాట్లాడినా ఇస్తామని పేర్కొన్నారు. గురువారం ఏపీ సర్కిల్‌ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉచిత బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్‌లో నెల రోజుల పాటు 10 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో రోజుకు 5 జీబీ వరకు ఉచితంగా ఇంటర్‌నెట్‌ వినియోగించుకోవచ్చని అన్నారు. ఆ తరువాత కనీస ప్లాన్‌ నెలకి రూ.349 (రోజుకి 2 జీబీ, 8 ఎంబీపీఎస్‌ స్పీడ్‌) నుంచి మొదలవుతుందన్నారు. 


గుంటూరు, విజయవాడ నగరాల్లో 4జీ సేవలు ఇప్పటికే మొదలయ్యాయని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఫైబర్‌ కనెక్టివిటీతో కేబుల్‌, ఇతర డేటా సేవలందించే సంస్థల భాగస్వామ్యంతో ఫైబర్‌ బ్రాడ్‌ బ్యాండ్‌, హోం వైఫై కనెక్షన్లు అందిస్తున్నామని, రాష్ట్రంలో తొలి ప్రయత్నంగా విశాఖపట్నంలో వీటిని ప్రారంభించామని అన్నారు.


ఈ సందర్బంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ లో ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడుతూ సంస్థకు దేశం లో లక్షా 60 వేల మంది, రాష్ట్రంలో 9 వేల మంది ఉద్యోగులున్నారని వివేక్‌ పేర్కొన్నారు. వీరిలో సగం మంది వచ్చే రెండు సంవత్సరాల లోపు పదవీ విరమణ చేయనున్నారు అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: