వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌లో కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన లేదని ఆదిత్య బిర్లా గ్రూప్ గురువారం స్పష్టం చేసింది. లైసెన్స్ ఫీజులు, సర్దుబాటు స్థూల ఆదాయం బకాయిలపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశీయ టెలికం పరిశ్రమపై పెను భారం పడిందని, తమను ఆదుకోని పక్షంలో దివాళాకు వెళ్తామని హెచ్చరించింది. ఇప్పటికే వోడాఫోన్ సీఈవో నిక్ రీడ్ భారత్‌లో భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆదిత్య బిర్లా గ్రూప్ సాయం చేయాలని కోరింది. లేదంటే దివాళాకు వెళ్తామని చెబుతోంది.


అధిక పన్నులు, చార్జీల భారం తగ్గించకుంటే కొనసాగే పరిస్థితులు లేవని నిక్ రీడ్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాలతో వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వొడాఫోన్ ఐడియా జాయింట్ వెంచర్ రెండో భాగస్వామి ఐడియా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.  సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెలికం పరిశ్రమపై రూ.1.4 లక్షల కోట్ల భారం పడనుంది. ఈ తీర్పు ప్రభావం ఎక్కువగా వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ పైన పడుతున్నాయి. జియో స్వల్ప మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది.


వొడాఫోన్ - ఐడియా క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు భాగస్వాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వం నుంచి మినహాయింపులు ఏమీ రాకుంటే మార్కెట్లో మనగలుగుతామా అనే సందేహాన్ని వ్యక్తం చేసిన వొడాఫోన్ ఐడియా సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ప్రభుత్వం నుంచి వచ్చే ఊరట ప్రకటనపై తమ మనుగడ ఆధారపడి ఉంటుందని, సానుకూల నిర్ణయం ఉంటుందని భావిస్తున్నామని తెలిపింది.

వొడాఫోన్ ఐడియా భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. తాజా క్వార్టర్ ఫలితాలు కంపెనీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చాయి. మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రమోటర్లు ఆసక్తిగా లేరు. వొడాఫోన్‌ ఐడియా దివాలా ప్రక్రియకు పోయినా పట్టించుకోకపోవడమే మేలని ఆదిత్య బిర్లా గ్రూప్, వొడాఫోన్‌ గ్రూప్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చాయని వార్తలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: