గత ఎన్నికల గెలుపు తరువాత అధికారాన్ని చేపట్టిన బీజీపీ ప్రభుత్వం, అన్ని రకాల పన్నులను ఒకే పన్ను విధానం క్రిందకు తీసుకువచ్చి ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) విధానం ఆమోదయోగ్యంగా ఉన్నప్పటికీ, అందులోని కొన్ని లోపాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, వాటిని పరిష్కరించి ఇకపై జీఎస్టీని మరింత సరళతరం చేసేలా కసరత్తులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయమై ఇటీవల చిన్న, పెద్ద సంస్థల వ్యాపారవేత్తలు, మరియు పలు వ్యాపార సంఘాల ప్రతినిధులు  జీఎస్‌టీ రిటర్నులను ఆన్‌లైన్‌లో ఫైల్‌ చేసి, వాటివలన తలెత్తుతున్న ఇబ్బందులను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ గారితో కలిసి భేటీ అయి విన్నవించడం జరిగింది. అయితే వారి అభ్యర్ధనను మన్నించిన మంత్రి నిర్మల గారు వాటిపై పలువురు అధికారులతో కలిసి కసత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే నేడు ఇండియన్‌ ఛార్టర్డ్‌ అకౌంట్స్‌ అసోసియేషన్‌ (ఐసీఏఐ) ప్రతినిధులు, లఘు ఉద్యోగ్‌ భారత్‌, రాజస్థాన్‌ టాక్స్‌ కన్సల్టెంట్స్‌ అసోసియేషన్‌, కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ఇండియా ట్రేడర్స్‌, కోల్‌కతా నుంచి వచ్చిన పన్ను నిపుణులతో నిర్మలా సీతారామన్‌ భేటీ అయ్యారు. జీఎస్‌టీ నెట్‌వర్క్‌ అధికారులు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. జీఎస్‌టీ ఫైలింగ్‌ విధానాన్ని మరింత సరళతరం చేయడమే ఈ కసరత్తు లక్ష్యం అని కేంద్ర మంత్రి నిర్మల ఈ సందర్భంగా తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక ట్వీట్‌ చేశారు. అలానే డిసెంబర్‌ 7వ తేదీన ఇటువంటి కసరత్తునే దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఆమె రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సరికొత్త రిటర్న్‌ ఫారమ్‌లు అమల్లోకి రానున్నాయి. 

ప్రస్తుతం జీఎస్‌టీ నెట్‌వర్క్‌ పోర్టల్‌లో ఇప్పటి వరకు 85,000 మంది ప్రయోగాత్మకంగా రిటర్నులను ఫైల్‌ చేశారు. ప్రతి కమిషనర్‌ ఆఫీస్‌లో ఎంపిక చేసిన అసెసీలను వారి అకౌంటెంట్లతో సహా పిలిపించి, వారితో అధికారుల ఎదుట రిటర్నులను ఫైలింగ్‌ చేయించడం వంటివి చేయాలి. అప్పుడే వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని రిటర్నుల దాఖలు మరింత మెరుగుపర్చడానికి అవకాశం ఉందని  రెవెన్యూ సెక్రటరీ అజేయ్‌ భూషణ్‌ పాండే వెల్లడించారు. అయితే త్వరలో రాబోయే ఈ నూతన విధానం వలన ఇకపై జీఎస్టీ రిటర్నులు ఫైలింగ్ మరింత సులభతరం అవుతుందని అంటున్నారు మార్కెట్ నిపుణులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: