ఆన్ లైన్ షాపింగ్ అంటే తక్కువ ధరలో మంచి వస్తువులు దొరికే చోటు. మనకి సౌకర్యవంతంగా వుంటూ నాణ్యమైన వస్తువులు దొరుకుతాయి ఈ ఆన్లైన్ షాపింగ్ సైట్స్ లో. ఈ రోజుల్లో  ఆన్లైన్ షాపింగ్ సర్వసాధారణం అయిపోయింది మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు మనకు నచ్చిన షాపింగ్ చెయ్యొచ్చు. ఇక ఆన్లైన్ షాపింగ్ సైట్స్ అంటే మనకు ఠక్కున గుర్తు వచ్చేది ఫ్లిప్‌కార్ట్‌. అయితే ఈ ఫ్లిప్‌కార్ట్‌ లో షాపింగ్ చేసేటప్పుడు జర జాగ్రత్త అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఆన్‌లైన్‌లో ఫోను కోసం బుక్‌ చేస్తే ఇటుకలు, రాళ్లు రావడం.. చొక్కానో ప్యాంటు కోసమో ఆర్డరిస్తే చీర పంపించడం..  ఇలాంటి వార్తలు మనం అప్పుడప్పుడు వింటుంటాం కదా. సరిగ్గా ఇలాంటి వి మనకే జరిగితే ఎంత ఇబ్బంది పడతామో కదా. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ-కామర్స్ సంస్థలపై వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధిక ఫిర్యాదులు ఫ్లిప్‌కార్ట్‌పై వచ్చాయి. రిలయన్స్‌ జియో, అమెజాన్‌, ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు తర్వాతి స్థానాల్లో ఉన్నాయట. 
 ఇ-కామర్స్‌ రంగానికి వినియోగదార్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో అదే స్థాయిలో ఫిర్యాదులూ పెరుగుతున్నాయని తెలుస్తోంది.

ప్రభుత్వానికి అందుతున్న వినియోగదారు ఫిర్యాదుల్లో ఇ-కామర్స్‌ సంస్థలపైనే అధికంగా ఉంటున్నాయట. ప్రతి 5 ఫిర్యాదుల్లో ఒకటి వీటిపైనేనట. అత్యధిక ఫిర్యాదులు ఫ్లిప్‌కార్ట్‌పై రావడం తో ఫ్లిప్‌కార్ట్‌ లో షాపింగ్ చేసే వారి పై ప్రభావం చూపొచ్చు అని తెలుస్తోంది. కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలకు అనుగుణంగా ఎకనమిక్స్‌ టైమ్స్‌  ఈ విషయం వెల్లడించింది.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 5 లక్షలకు పైగా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాగా.. లక్షకు పైగా ఫిర్యాదులు ఇ-కామర్స్‌ సంస్థలకు సంబంధించినవే. పాడైన వస్తువులను పంపించారని, ఎక్స్ఛేంజీ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆర్డరు చేసిన వస్తువును ఆలస్యంగా పంపించారని లాంటి కారణాలు చూపుతూ ఇ-కామర్స్‌ సంస్థలపై ఎక్కువ మంది ఫిర్యాదులు చేశారు.


ఇక ఫ్లిప్ కార్ట్ పై అధిక ఫిర్యాదులు రావడం తో సంస్థ స్పందించింది "వినియోగదారుల సహకారానికి, వారికి ఎదురయ్యే సమస్యల సత్వర పరిష్కారానికి ఎప్పటికప్పుడు మా విధానాలను మెరుగుపర్చుకుంటూ వస్తున్నాం. ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌ వినియోగం, విధానాలు, షరతులపై వినియోగదార్లకు మార్గదర్శనం చేస్తున్నాం. ఇ-కామర్స్‌ లావాదేవీలపై అవగాహన నిమిత్తం ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. ఉత్పత్తుల నాణ్యత విషయంలో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండేందుకు ఆ విక్రయదార్లకు శిక్షణ ఇవ్వడంపైనా దృష్టి పెడుతున్నాం" అని ఫ్లిప్‌కార్ట్‌ అధికార ప్రతినిధి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: