ఒకప్పుడు బంగారం కొనాలి అంటేనే తలెత్తి కూడా చూసేవారం కాదు.. అందుకేనేమో  ఇప్పుడు పసిడి వెలవెలబోతోంది. వెండి కూడా ఇదే దారిలో పయనిస్తోందని అంటున్నారు. బంగారం ధర పడిపోవడానికి పలు అంశాలు కారణాలుగా ఉన్నాయి. దేశీయంగానే కాకుండా గ్లోబల్ మార్కెట్‌లోనూ ఇలాంటి ట్రెండే నడుస్తోంది.


ప్రస్తుతం బంగారం ధర పడిపోతూ.. వస్తోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటికి రూ.37,971 స్థాయికి క్షీణించింది. పసిడి ధర సెప్టెంబర్ నెల ఆరంభంలో 10 గ్రాములకు ఏకంగా రూ.40,000 మార్క్ పైకి చేరింది. అయితే, అప్పటి నుంచి చూస్తే ఇప్పటికి అంటే 2 నెలలో బంగారం ధర ఏకంగా రూ.2,000 పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర కేజీకి రూ.44,385 స్థాయికి తగ్గింది. సెప్టెంబర్ నెల ఆరంభంలోనే కేజీ వెండి ధర ఏకంగా రూ.50 వేల పైకి చేరింది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. సెప్టెంబర్ నెల ఆరంభంలో గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు ఆరేళ్ల గరిష్ట స్థాయి అయిన 1550 డాలర్లకు చేరింది.


బంగారం ధర పడిపోవడానికి ఐదు కారణాలున్నాయని నిపుణులు స్పష్టం చేశారు.
1. అమెరికా- చైనా మధ్య చాలా కాలంగా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య డీల్ కుదుర్చుకునే అంచనాలు నెలకొన్నాయి. అందువల్ల బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడుతూ వచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు.
2. దిగుమతి సుంకాల పెంపు, రూపాయి బలహీనత వంటి అంశాల కారణంగా బంగారం ధర బాగా పెరిగింది. దీంతో బంగారం కొనే వారు తగ్గిపోయారు. దీంతో పసిడి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడింది. డిమాండ్ తగ్గడంతో ఆ ప్రభావం ధరపై కనిపిస్తోంది.
3. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ర్యాలీ చేస్తున్నాయి. వాల్‌ స్ట్రీట్ కొత్త గరిష్టాలకు చేరింది. దీంతో బంగారం డిమాండ్ తగ్గింది.


4. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది ఇప్పటి దాకా మూడు సార్లు కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. అయితే ఇకపై రేట్ల కోత ఉండదని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గుచూపడం తగ్గించేశారు. దీంతో పసిడి ధరపై ఒత్తిడి నెలకొంది.
5. ఆరు ప్రధాన కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే డాలర్ ఇండెక్స్ స్థిరంగా కొనసాగుతుండటం కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అమెరికా డాలర్ 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఇతర కరెన్సీ కలిగిన వారికి బంగారం ఖరీదవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: