జియో బాటలోనే వెళ్లేందుకు రెడీ అయ్యాయి మరో రెండు టెలికాం కంపెనీలు.  వినియోగదారుల్ని బాదేసేందుకు వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ సిద్ధమయ్యాయి. టారిఫ్‌ పెంచుతున్నట్లు వొడాఫోన్‌ ఐడియా ప్రకటించిన కాసేపటికే ఎయిర్‌టెస్‌ కూడా అదే పాట ఎత్తుకుంది.

 

జియో నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న టెలికాం కంపెనీలు అదే దారిలో పయనించనున్నాయి. తమ టారిఫ్‌ ధరలను పెంచుతున్నట్లు వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ కంపెనీలు ఒకేరోజు ప్రకటించాయి. డిసెంబర్‌ 1 నుంచి ధరలు పెంచుతున్నట్లు వొడాఫోన్‌ ఐడియా ప్రకటించగా.. డిసెంబర్‌ మొదట్లో రేట్లు పెంచడానికి ఎయిర్‌టెల్ రెడీ అయింది. అయితే ఎంత మొత్తంలో పెంచుతుందీ రెండు కంపెనీలూ వెల్లడించలేదు.

 

వినియోగదారులకు ప్రపంచస్థాయి డిజిటల్‌ సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వొడాఫోన్‌ తెలిపింది. వ్యాపారం లాభసాటిగా ఉండేందుకు ఎయిర్‌టెల్‌ టారిఫ్‌ రేట్లను పెంచడానికి డిసైడ్‌ అయింది. సెప్టెంబర్‌ 30తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఈ రెండు కంపెనీలు భారీ మొత్తంలో నష్టాలు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకున్నాయి. సవరించిన స్థూల ఆదాయం విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో టెలికాం కంపెనీలపై పెను భారం పడింది. దీంతో ఆదుకోవాలని ఆయా కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.

 

ప్రభుత్వం సహకరించకుంటే భారత్‌లో తాము కొనసాగడం కష్టమేనని వొడాఫోన్‌ కంపెనీ ఇటీవల చెప్పింది. అయితే ఐయూసీ ఛార్జీల విషయంలో వేరే నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌పై నిమిషానికి 6పైసలు లెక్కన వసూలు చేయనున్నట్లు జియో ఇది వరకే ప్రకటించింది. జియో బాటలోనే వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ సైతం వినియోగదారులపై భారం మోపడానికి సిద్ధమవుతున్నాయి. టారిఫ్ పెంపు విషయంలో టెలికం కంపెనీలతో ట్రాయ్ సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది.

 

మరి రానుంది కొత్త సంవత్సరం కావడంతో టెలికాం కంపెనీలు మొత్తానికి జనంపై ఛార్జీల భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. చూడాలి వినియోగదారులు ఈ నిర్ణయానికి ఎలా స్పందిస్తారో.. !

మరింత సమాచారం తెలుసుకోండి: