ప్రపంచ నంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై మళ్లీ హ్యాకర్ల దాడి జరిగింది. తాము ఎంచుకున్న వారికి ఒక ఎంపీ4 ఫైల్ ను పంపడం ద్వారా వారి ఫోన్లను మంచినీళ్లు తాగినంత సులభంగా ఫోన్లను హ్యాక్ చేసేస్తున్నారు. ఈ దాడి ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండు ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేసే ఫోన్లపైనా జరిగింది. దీని బారిన పడకుండా ఉండాలంటే వినియోగదారులు తమ ఫోన్లను అప్ డేట్ చేయక తప్పదు. ఈ ఎంపీ4 ఫైల్ లో ఉన్న కోడ్ ప్రకారం దీన్ని అత్యంత ప్రమాదకరమైన దాడిగా గుర్తించారు. మీరు ఈ ఫైల్ పై క్లిక్ చేయగానే ఇందులో ఉన్న కోడ్ పనిచేయడం ప్రారంభిస్తుంది. దీంతో మీ ఫోన్ లో ఉన్న డేటా వారి చేతిలోకి వెళ్లిపోతుంది. వాట్సాప్ పై కొన్ని రోజుల కిందట జరిగిన పెగాసస్ దాడి గురించి మరిచిపోకముందు ఇలాంటి మరో దాడి జరగడం ఆన్ లైన్ భద్రతపై సందేహాలను రేకెత్తిస్తోంది.

 

ఇజ్రాయేల్ కు చెందిన పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా ఓ సైబర్ గూఢచార సంస్థ మొత్తం 1,400 మంది వినియోగదారుల వాట్సాప్ ను హ్యాక్ చేసింది. వీరు మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు కూడా ఉండటం విశేషం. ఈ విషయంపై పెద్దస్థాయిలో రచ్చ జరగడంతో ఈ సాఫ్ట్ వేర్ ను ఇప్పటివరకు కొనలేదని, కొనే ఉద్దేశం కూడా లేదని భారత ప్రభుత్వం ప్రకటించింది.

 

ఈ ఘటన వాట్సాప్ కూడా స్పందించింది. భారతదేశ ప్రభుత్వ ప్రకటనతో ఏకీభవిస్తున్నట్లు వాట్సాప్ అధికార ప్రతినిధి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. భారతదేశ పౌరుల ప్రైవసీని రక్షించే బాధ్యత తమపై ఉందన్నారు. అందుకే సైబర్ దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాట్సాప్ లో వినియోగదారులు పంపించే ప్రతి మెసేజ్ కు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంటుందని తెలిపారు.

 

అయితే ఈ దాడి వాట్సాప్ పాత వెర్షన్లపై జరిగింది. అందుకే వాట్సాప్ ఎప్పటికప్పుడు తన వెర్షన్లను అప్ డేట్ చేసుకోవాల్సిందిగా వినియోగదారులకు సూచిస్తుంది. ఈ తరహా దాడుల ద్వారా హ్యాకర్లు మన ఫోన్లలోని డేటాను దొంగిలించడంతో పాటు, దీని ద్వారా మన చర్యలను కూడా ట్రాక్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జరిగిన దాడి ద్వారా హ్యాకర్లు మీ ఫోన్ ని ప్రపంచంలో ఎక్కడినుంచి అయినా ఎటువంటి అనుమతులూ అవసరం లేకుండా ఉపయోగించవచ్చు. కాబట్టి వాట్సాప్ లో వచ్చే ప్రతీ ఫైల్ ను ఓపెన్ చేయకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: