ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి సాగు యథేచ్ఛగా  కొనసాగిపోతోంది. ఏళ్ల తరబడి ఈ దందా కొనసాగుతూనే ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అధికారులు మాత్రం అక్రమార్కులు ఇచ్చే మామూళ్ల మత్తులో జోగుతున్నారు. గంజాయి సాగును చూసీచూడనట్టుగానే వదిలేస్తున్నారు. దీంతో గంజాయి సాగుకు జిల్లాలో అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఈ సాగు వల్ల అధికారుల జేబులు...సూటుకేసులు సైతం నిండుతున్నాయి. యువత మాత్రం మత్తులో తూగుతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అప్పుడప్పుడు ఒకటి అరా గంజాయి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయినా...గంజాయి సాగు...వినియోగంపై మాత్రం ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు.

 

తాజాగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో భారీగా గంజాయి పంటను ద్వంసం చేశారు పోలీసులు. పత్తి, కందిపంటలో అంతర్ పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు అక్రమార్కులు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో బోథ్ సీఐ, బజార్ హత్నూర్ ఎస్సైలు పంటపొలాల్లో గంజాయి మొక్కలను తొలగించారు. ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు రెండు వేల మొక్కలు ద్వంసం చేసి ట్రాక్టర్లో తరలించారు పోలీసులు.

 

ఇక...ఇటీవల  నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రాజేశ్వర్ తండా శివారు అటవీ ప్రాంతంలో పత్తి, కంది పంటలలో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి పంటను గుర్తించారు. ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో గంజాయిని ధ్వంసం చేశారు. సుమారు పదిహేను ఎకరాలలో పత్తి, కంది పంటల మాటున అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మేలు రకమైన గంజాయిని సాగు చేస్తున్నారు. గంజాయి మొక్కలతో పాటు లక్ష రూపాయల విలువైన ఎండు గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పొరుగు రాష్ట్రాలకు గంజాయి తరలిపోతోంది. ఇష్టారీతిన గంజాయి సాగు చేస్తూ అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారు. అయితే ఈ కేసులో ఎలాంటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎక్సైజ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: