సామాన్య, మధ్యతరగతి జీవులకు ఉల్లి ధర ఘాటెక్కిస్తుంది.  నిన్న, మొన్నటి వరకు కిలో ఉల్లి ధర యాభై, అరవై అంటేనే జనం ఇంత రేటా అని హడలిపోతే.. ఇపుడు ఏకంగా 100 రూపాయలకు చేరింది.. దాంతో ప్రజలే కాదు , రిటైల్ వ్యాపారులు సైతం ఆందోళన పడుతున్నారు.

 

ఉల్లిరేటు సామాన్య ప్రజలను కన్నీరు పెట్టిస్తోంది. హైదరాబాద్ మలక్‌పేట మార్కెట్‌లోనే కిలో ఉల్లిధర 100 కు చేరింది. డిమాండ్‌కు తగ్గట్టు ఉల్లి ఉత్పత్తి లేకపోవడంతో రేటు అమాంతం పెరిగిపోయింది. వారం వారం ఉల్లి ధర చుక్కలను తాకుతోంది. ఒకరోజు ఉన్న ధర మరో రోజు ఉండటం లేదు. తెలుగు రాష్ట్రాల గత పదేళ్ళలోనే ఎన్నడూ లేనంతగా ఉల్లి ధర వంద రూపాయలకు చేరకుంది. ఢిల్లీ, ముంబైలో ఇప్పటికే వందరూపాయలు పలుకుతుంటే... తెలుగు రాష్ట్రాల్లో సైతం వందరూపాయలకు ఉల్లి ధర చేరింది.. ఈసారి దేశంలో పలుచోట్ల పంట ఉత్పత్తి తగ్గడంతో.. ఉల్లి ధర అమాంతం పెరిగిపోతుంది. మార్కెట్‌లో ఉల్లి కొనాలంటేనే భయమేస్తోంది.  

 

హైదరాబాద్ బహిరంగ మార్కెట్లలో మేలురకం ఉల్లిధర 100 రూపాయల వరకూ ఉంది. నాసిరకం ఉల్లిపాయలు కావాలన్నా 45 నుంచి 50 రూపాయల వరకూ పెట్టాల్సిందే. కేవలం పట్టణాల్లోనే కాదు... గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దేశంలో ముఖ్యంగా మూడు సీజన్లలో ఉల్లిను సాగుచేస్తారు. ఎండాకాలంలో వేసిన పంట డిసెంబర్‌లో మార్కెట్‌లోకి వస్తుంది. అయితే ఈ మధ్య కురిసిన వర్షాలకు ఉల్లి పంట పూర్తిగా దెబ్బతింది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రాలో ఉల్లి పంట నాశనమవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. చివరకు మురిగి పాడైపోయిన ఉల్లిగడ్డ సైతం 30 రూపాయలకు పైగానే పలుకుతుంది. వేరే దారిలేక ఎగబడి మరీ కొంటున్నారు జనం.


 
నాసిరకం ఉల్లిగడ్డతో ఇక్కట్లు తప్పడం లేదని వ్యాపారులు గొల్లుమంటున్నారు. మంచిరకం ఉల్లిగడ్డ 100 రూపాయలు పలుకుతుందని, పైసలు గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. మరోవైపు ఉల్లిధర నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. ఇప్పటికే 673 మెట్రిక్ టన్నుల ఉల్లిని ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి, రాష్ట్రలోని రైతు బజార్ల ద్వారా సరఫరా చేసామని చెప్పారు. కిలో ధర 25రూపాయలలోపు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త పంట మార్కెట్‌కు వచ్చేంతవరకు.. అంటే మరో నెలరోజులపాటు ఇదే ధర కొనసాగవచ్చంటున్నారు వ్యాపారులు. అంత వరకు ప్రజలకు ఉల్లిగాయాలు తప్పేలా లేదు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: