దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఠారెక్కిస్తున్నాయి. కిలో ఉల్లి ఏకంగా వంద రూపాయలకు చేరడంతో.. ధర  అదుపునకు చర్యలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలోనూ ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి  నుంచి రైతుబజార్లలో కిలో ఉల్లి 40 రూపాయలకు అందుబాటులోకి రానున్నాయి. 


ఉల్లి ధర మండిపోతోంది. పెరిగిన ఉల్లి ధరలు పేద, మధ్యతరగతి జనాలతో కన్నీరు పెట్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర ఏకంగా వంద రూపాయల మార్కుకు చేరువకావడంతో అప్రమత్తమైన కేంద్రం.. ధరల నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇతర దేశాలకు ఎగుమతులు నిలిపివేసి.. ఉల్లి పండించే దేశాల నుంచి భారీగా దిగుమతులు చేసుకుంటోంది. ఉల్లిని అక్రమంగా నిల్వ చేసే వ్యాపారులపైనా చర్యలు తీసుకుంటోంది. మరికొద్ది రోజుల్లో జార్ఖండ్‌ సహా పలు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఉల్లి ధరలను తగ్గించి, ఆ ప్రభావం ఎన్నికలపై లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తోంది. 

 

ఉల్లి ధరల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెటింగ్‌ శాఖ అధికారులు.. మలక్‌పేట గంజ్ మార్కెట్‌లోని ఉల్లి వ్యాపారులతో చర్చించారు. దీంతో మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతుబజార్లలో కిలో ఉల్లిపాయలు 40 రూపాయలకు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో వినియోగదారుడికి ఒక్క కిలో చొప్పున విక్రయించనున్నారు. దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఇతర రైతుబజార్లలో ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. మరోవైపు.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నఉల్లిని.. తమకు కూడా కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయనుంది తెలంగాణ సర్కార్. అయితే బహిరంగ మార్కెట్‌ల్లో ఉల్లిధరలు మండిపోతున్నాయని.. వాటిని కొనలేక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నామని పేద, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. ఉల్లి ధరల మంటలకు జనం గగ్గోలు పెడుతున్నారు. ఎలాగైనా రేట్లను తగ్గించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. ఉల్లి ఘాటు నుంచి ఉపశమనం చేకూరేలా చూడాలంటున్నారు. కిలో ఉల్లి ఏకంగా వంద రూపాయలకు చేరడంతో.. ధర  అదుపునకు చర్యలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: