టాటాలు అంటే విశ్వ‌స‌నీయ‌త‌కు మారుపేరు. ఉద్యోగుల విష‌యంలో ఈ సంస్థ‌ను ఎంతో అభిమానిస్తుంటారు. అయితే, మిగ‌తా సంస్థ‌ల వ‌లే టాటాలు కూడా ఆలోచిస్తున్నార‌ని స్ప‌ష్ట‌మైంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటర్స్ ఇప్పటికే పలు నిర్వహణ ఖర్చులను తగ్గించుకుంటున్న తరుణంలో....తాజాగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని(వీఆర్‌ఎస్) ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా 1,600 మంది ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చేయోచనలో సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది.  అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న  సంస్థ ఖర్చులను తగ్గించుకునే క్ర‌మంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

 

గతేడాదితో పోలిస్తే ఉద్యోగులపై పెట్టే ఖర్చు తడిసి మోపెడు అవుతున్నదని, జేఎల్‌ఆర్‌లో అదనంగా ఉన్న సిబ్బందిని తొలగించిన యాజమాన్యం, ఇక టాటా మోటర్స్‌లో 1,600 మందికి పైగా వీఆర్‌ఎస్ ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని సంవ‌త్స‌రాలుగా ఉద్యోగులపై పెట్టే ఖర్చు తగ్గించుకుంటూ వచ్చిన సంస్థ..2017లో మాత్రం తిరిగి తీసుకోనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ విక్రయాల్లో ఉద్యోగులపై పెట్టే ఖర్చు 10.7 శాతానికి చేరుకున్నది. క్రితం ఏడాది ఇది 5.9 శాతంగా ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.10 వేల కోట్ల ఆదాయంపై రూ.1,281.97 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. ఇప్పటికే హీరో మోటోకార్ప్, టయోటా కిర్లోస్కర్, అశోక్ లేలాండ్‌లు ఇలాంటి స్కీంను ప్రకటించాయి. తాజాగా టాటాలు కూడా అదే బాట‌లో చేర‌డం గ‌మ‌నార్హం.టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన విక్రయాలు 18,290 నుంచి 13,169లకు పడిపోయాయి. క్రితం ఏడాదితో పోలిస్తే 26 శాతం తగ్గినట్లు అయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: