ఉల్లి సంక్షోభం రోజురోజుకూ పెరుగుతోంది. కిలో వందరూపాయలు దాటేయడంతో.. పేద, మధ్యతరగతి జనం బేజారవుతున్నారు. దీంతో ఉల్లి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు పలు  రాష్ట్రప్రభుత్వాలు.. రాయితీపై అందించేందుకు దుకాణాలు తెరుస్తున్నాయి. మరోవైపు కేంద్రం కూడా ఉల్లిధరలకు కళ్లెం వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

 

ఉల్లి కోయకుండానే జనంతో కన్నీళ్లు పెట్టిస్తోంది. కిలో ఉల్లి ధర వందరూపాయలు మార్కు దాటి దూసుకుపోతోంది. నింగినంటుతున్న ఉల్లిగడ్డను కొనలేక .. జనం బావురుమంటున్నారు. ప్రభుత్వాలు రాయితీ ధరపై  అందిస్తామని ప్రకటించి, దుకాణాలు ఏర్పాటు చేస్తున్నా అది ఏమూలకు చాలడం లేదు. దీంతోబహిరంగ మార్కెట్‌లో వందలరూపాయలు పెట్టి ఉల్లిగడ్డ కొనలేక.. వినియోగదారులు బేజారవుతున్నారు. ప్రధానంగా చిరు ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగామారింది. వచ్చే జీతం ఏమూలకు చాలడం లేదని, ఇప్పుడు ఈ ధరల పుణ్యమాని అప్పులు చేయాల్సి వస్తోందని లబోదిబోమంటున్నారు. ఇక మహిళలైతే,  ఉల్లి లేకుండా ఎలా వంట చేయాలని తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వాలు ఉల్లి ధరలకు కళ్లెం వేయాలని కోరుతున్నారు.

 

ఇదే అదనుగా దేశంలో ఉల్లిపాయల దొంగతనాలు జరుగుతున్నాయి. పలుప్రాంతాల్లో ఉల్లిగడ్డలను దొంగలు లూఠీ చేస్తున్నారు. మరోవైపు..ఉల్లిధరలను అదుపు చేయాలంటూ విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి.  బీహార్‌లో ఉల్లిధరలు పెరిగిపోవడంతో.. ప్రభుత్వం కిలో ఉల్లిగడ్డలను 35 రూపాయలకు విక్రయిస్తోంది. పాట్నాతో పాటు పలు నగరాల్లో ఉల్లిగడ్డల కోసం జనం బారులు తీరుతున్నారు. కొందరు ఉల్లిపాయలు అందడం  లేదన్న బాధతో .. విక్రయిస్తున్న వారిపై రాళ్లు విసురుతున్నారు. వారి నుంచి రక్షణ కోసం తలకు హెల్మెట్ ధరించి విక్రయిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 

ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో ఉల్లి సరఫరా పెంచేందుకు టర్కీ నుంచి 11,000 టన్నుల ఉల్లి దిగుమతులకు ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ ఆర్డర్ ఇచ్చింది. ఈ సంస్థ ఇప్పటికే  ఈజిప్ట్‌ నుంచి 6 వేల 90 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. తాజా ఆర్డర్‌తో పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఉల్లి ధరలను సమీక్షించేందుకు హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో మంత్రుల  బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉల్లి ఎగమతులపై నిషేధం విధించిన కేంద్ర కేబినెట్‌ ..1.2 లక్షల టన్నుల ఉల్లి దిగుమతులకు ఆమోదం తెలిపింది. దిగుమతి చేసుకున్న ఉల్లిని ఆయా రాష్ట్రాలకు కిలో రూ 50 నుంచి  60లకు అందచేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: