ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ లో 92వేలమందికి పైగా ఉద్యోగులు వీఆర్ఎస్‌కు సిద్ధమయ్యారు. పాడి ఆవులా మెలిగిన ఈ సంస్థ కొన్నాళ్లుగా నష్టాల్లో ఉంది. వేతనాల భారం నుంచి బయటపడేందుకు యాజమాన్యం వీఆర్ఎస్ స్కీమ్ ను తెరపైకి తెచ్చింది. 

 

భారత ప్రభుత్వ రంగ టెలికం కంపెనీలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లు ఇటీవల ప్రకటించిన స్వచ్ఛంధ పదవీ విరమణ పథకం గడువు మంగళవారంతో ముగిసింది. మొత్తంగా 92వేల 700 మంది ఉద్యోగులు వీఆర్ఎస్‌ను ఎంచుకున్నారు. వీరిలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 78వేల 300 మంది అయితే, ఎంటీఎన్ఎల్ ఉద్యోగులు 14వేల 378 మంది ఉన్నారు. 

 

దేశంలో అన్ని సర్కిళ్ల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 78వేల 300 మంది ఉద్యోగులు వీఆర్ఎస్‌ను ఎంచుకున్నారని బీఎస్ఎన్ఎల్ ఎండీ పీకే పుర్వార్ తెలిపారు. తాము 82 వేల మందిని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలిపారు. తాము పెట్టుకున్న టార్గెట్‌కు మించి ఉద్యోగులు వీఆర్ఎస్‌ను ఎంచుకున్నట్టు ఎంటీఎన్ఎల్ చైర్మన్, ఎండీ సునీల్ కుమార్  తెలిపారు. తాము నిజానికి 13వేల 650 మందినే టార్గెట్‌గా పెట్టుకున్నామని, కానీ 14వేల 378 మంది స్వచ్ఛంద పదవీ విరమణకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. 

 

వీఆర్ఎస్ వల్ల వేతనాల భారం ఏడాదికి రూ.2వేల 272 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గుతుందన్నారు. వీఆర్ఎస్ అనంతరం తమ ఉద్యోగుల సంఖ్య 4వేల 430కి తగ్గుతుందని బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ యాజమాన్యం చెబుతోంది. సంస్థ సేవలను కొనసాగించేందుకు వీరు సరిపోతారని వివరణ ఇచ్చింది. రైల్వేల తర్వాత అతి పెద్ద సంస్థలో ఇలాంటి దుస్థితి రావడంపై కొందరు వాపోతుంటే... గతమెంతో ఘనకీర్తి అని ఉద్యోగులు భారంగా వీఆర్ఎస్ కు మొగ్గు చూపారు.మొత్తానికి బీఎస్ఎల్ తీసుకొచ్చిన స్కీమ్ కు వందలాది మంది అంగీకరించారు. నష్టాల్లో ఉన్నందువల్లే ఆ టెలికాం సంస్థ స్వచ్ఛంధంగా పదవీవిరమణ పథకాన్ని తీసుకొచ్చినట్టు వాదనలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: