సాధారణ ఉద్యోగులకి నెలాఖరు వచ్చిందంటే చాలు...  డబ్బు కొరతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకటో తేదీ రోజు వచ్చిన జీతం డబ్బులన్నీ దాదాపు తొలి వారంలోనే అయిపోతాయి. ఎలాగోలా బండిని నెలాఖరుకు లాక్కోస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఊహించని ఖర్చులు ఎదురు కావొచ్చు. అప్పుడు మన ప్రణాళిక అమలు కాకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల వద్ద డబ్బు అప్పు తీసుకుంటాం. ఒకవేళ వీరి వద్ద నుంచి సహకారం లేకపోతే అప్పుడు ఎలా ?


బ్యాంకు పర్సనల్ లోన్ వైపు చూస్తాం. అయితే పర్సనల్ లోన్ తీసుకోవడానికి వారం రోజులు టైమ్ పట్టొచ్చు, పైగా పర్సనల్ లోన్ వస్తుందో లేదో కూడా కచ్చితంగా చెప్పలేం. మరి సమస్య గట్టెక్కడం ఎలా? ఇలాంటి వారి కోసం పేడే లోన్స్ అనే రకం రుణాలు అందుబాటులో ఉన్నాయి. పేడే లోన్స్ కూడా పర్సనల్ లోన్స్ లాగానే  ఉంటాయి. ఇవి కూడా అన్‌సెక్యూర్డ్ లోన్స్ . అయితే పర్సనల్ లోన్స్ లాగా ఎక్కువ కాల వ్యవది ఉండదు త్వరగా  చెల్లించాల్సి ఉంటుంది. పేడే లోన్స్‌ను వడ్డీతో సహా కలిపి 7 రోజుల నుంచి 30 రోజుల లోగా తిరిగి చెల్లించాలి . గరిష్టంగా 90 రోజుల్లో కచ్చితంగా లోన్ చెల్లించాల్సిందే. రూ.5,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణం పొందొచ్చు. 
 
ఇలాంటి లోన్స్ ని భారత్‌లో దాదాపు డజను సంస్థలు అందిస్తున్నాయి. ఎకనమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ సంస్థలు ప్రతి నెలా దాదాపు రూ.400 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేస్తున్నాయి. లోన్4స్మైల్, క్రెడిట్ బజార్, ఎక్సీడ్ క్యాష్, లోన్వాలా వంటి పలు సంస్థలు ఈ తరహా లోన్స్ అందిస్తున్నాయి. ఇవి అందించే  సంస్థలు రుణాలపై రోజుకు 0.1 శాతం నుంచి 2 శాతం మధ్యలో వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి మరియు  ఈ తరహా రుణాలు పొందటానికి క్రెడిట్ స్కోర్ అవసరం లేదు. అలాగే తక్కువ డాక్యుమెంటేషన్‌తో రుణాన్ని పొందొచ్చు.

 

ఆధార్ కార్డు, పాన్ కార్డు, లేటెస్ట్ శాలరీ స్లిప్, 3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుంది. వీటిని ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు పోస్ట్ డేటెడ్ చెక్ కూడా అందించాలి. చెక్ బౌన్స్ అయితే కంపెనీ లీగల్ యాక్షన్ తీసుకుంటుంది. దీంతో డబ్బులు అత్యవసరం అయిన వారు, క్రెడిట్ స్కోర్ బాగలేని వారు అవసరం కోసం వీటి వద్ద నుంచి రుణాలు తీసుకోవచ్చు. లోన్ తీసుకున్న తర్వాత గడువులోగా చెల్లించలేకపోతే.. కాల వ్యవదిని  పొడిగించుకునే ఆప్షన్ ఉంది. అయితే దీనికి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రూ.500 నుంచి రూ.1,000 వరకు చార్జీలు పడతాయి. అలాగే పెరిగిన రోజులకు వడ్డీ కూడా చెల్లించాలి. కొన్ని సంస్ధలు లోన్ అమౌంట్‌లో ప్రాసెసింగ్ ఫీజు‌ను 7 శాతం వరకు వసూలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: