ఉల్లి ధరలు మంటెక్కిస్తూనే ఉన్నాయ్‌. కిందకు దిగి రావడం లేదు. కిలో ఉల్లిపాయలు వందకుపైనే పలుకుతున్నాయి. కర్నూలు  మార్కెట్‌లో రేట్లు తగ్గడం జనాలకు ఊరటనిస్తోంది. కూరలో ఉల్లిపాయ చూసి ఎన్నాళ్లయ్యిందో.. ! ఇదీ.. సామాన్యుల మాట. కిలో ఉల్లిపాయలు 120 నుంచి 150 పలుకుతుండటంతో ఉల్లిపాయ వైపు చూడటమే మానేశారు పేదలు. కొందరైతే రేటు పెరిగినప్పటి నుంచీ ఉల్లిపాయను చాలా అపురూపంగా చూసుకుంటున్నారు. ఇక ఉల్లి లేకుండా  కూర తినలేమని భావించే జనం మాత్రం.. ప్రభుత్వం సబ్సిడీపై  అందించే ఉల్లిపాయల కోసం రైతు బజార్లకు క్యూ కడుతున్నారు. 

 

జనాల రద్దీని చూసి ఉల్లి కౌంటర్ల దగ్గర పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయడం విశేషం. అనంతపురంలో ఇవే సీన్లు కనిపించాయి. విజయనగరం జిల్లాలో రైతు బజార్ల దగ్గర ఉదయం నుంచీ పడిగాపులు కాసినా.. ఉల్లిపాయలు దొరకని పరిస్థితి. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులో నోస్టాక్‌ బోర్డులు జనాల్ని వెక్కిరిస్తున్నాయి. ప్రకాశం, విజయవాడ, రాజమండ్రి ఎటు చూసినా.. సబ్సిడీ ఉల్లిపాయల కోసం జనం  రైతు బజార్లకు క్యూ కడుతున్నారు. అయితే సరుకు తక్కువగా వస్తుండటంతో వచ్చిన వారందరికీ ఉల్లిపాయలు దొరకని పరిస్థితి. 

 

శ్రీకాకుళం జిల్లాలో ఉల్లికోసం ఒలింపిక్‌ ఫీట్స్‌ చేస్తున్న మహిళలు.. రైతు బజార్ల దగ్గర  కిలో ఉల్లికోసం నానా తిప్పలు పడుతున్నారు. విశాఖలో ఉల్లికి ప్రజాసంఘాలు తులాభారం వేశాయి. విజిలెన్స్‌ అధికారులు ఉల్లి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక జనాలకు ఊరటనిచ్చే విషయం... కర్నూలు మార్కెట్‌లో క్వింటా ఉల్లి ధర ఒక్క రోజులోనే 4,500 తగ్గి 8,900లకు  దిగొచ్చింది.  ఇలా ఒక్కసారిగా రేటు పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. జనం మాత్రం సంతోష పడుతున్నారు.  ఇతర రాష్ట్రాలకు ఉల్లి ఎగుమతులు నిలిపివేయడం వల్లే ధరలు తగ్గాయని చెబుతున్నారు అధికారులు.  రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే ఎగుమతులపై దృష్టిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్నిచోట్ల నిబంధనలు అతిక్రమించి ఉల్లి లోడ్‌లతో వెళ్తున్న లారీలను అధికారులు సీజ్‌ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: