ఇంటర్నెట్.. ఇప్పుడు పెద్దలకే కాదు, పిల్లలకు కూడా ఫేవరెట్ అయిపోయింది. ఎంతగా అంటే, స్కూలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు నెట్‌లోనే బ్రౌజింగ్ చేసేంత.  అలాగూ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్.. అంటూ సోషల్ మీడియాలో సంచరిస్తున్నారు. లేదంటే.. ఆన్‌లైన్ షాపింగ్‌కో, మనీ ట్రాన్స్‌ఫర్‌కో ఇంటర్నెట్ వాడక తప్పని స్థితి. ఫ‌లితంగా భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఇక ఈ ఒక్క సంవత్సరంలోనే భారత్‌లో డేటా వినియోగం విపరీతంగా పెరిగిపోయినట్లు ట్రాయ్ తాజాగా ప్రకటించింది. 

 

భారత్‌లో ఈ ఏడాది ఇంటర్నెట్​ డేటాను భారీఎత్తున వినియోగించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్'​ తెలిపింది. సెప్టెంబర్‌ వరకు విడుదలైన సమాచారం ప్రకారం 54,917 మిలియన్ల జీబీ డేటాను వినియోగించినట్లు తెలుస్తోంది. 2014లో 828 మిలియన్ల జీబీ డేటా మాత్రమే వినియోగించగా.. 2018 నాటికి ఇది 46,404 మిలియన్ల జీబీకి చేరింది. 2019లో ఇప్పటివరకు వచ్చిన లెక్కలను చూస్తేనే గత ఏడాది డేటాను ఎప్పుడో దాటేసింది. ఇదిలా ఉంటే.. 2014లో వైర్‌లెస్ ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య 281.58 మిలియన్లు ఉండగా.. ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి వారి సంఖ్య 664.80 మిలియన్లకు చేరింది. 

 

మ‌రి డేటా వినియోగం పెరిగేందుకు కారణాలేంటా అని చూస్తే.. ఈ నాలుగేళ్లలో వైర్‌లెస్‌ డేటా వినియోగం ఊహకందని స్థాయిలో పెరిగిపోయిందని ట్రాయ్‌ అభిప్రాయపడింది. 4జీ రాకతో నెమ్మదిగా ఆ సాంకేతికత ఉన్న పరికరాలూ పెరగడం ఇంటర్నెట్‌ డేటా వినియోగం భారీ పెరిగేందుకు దోహదపడిందని తెలుస్తోంది. దీంతోపాటు తక్కువ దరలకు ఫోన్లు కూడా లభించడంతో వినియోగించే వారి సంఖ్య పెరిగింది. దీని వ‌ల్ల కూడా ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: