దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తీసుకున్న నిర్ణయాలు నిన్నటినుండి అమలులోకి వచ్చాయి. కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోన్న ఎస్బీఐ మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను తీసుకువస్తూ ఉంటుంది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించటానికి ఎస్బీఐ మూడు కీలక నిర్ణయాలను తీసుకొచ్చింది. ఎస్బీఐ ఖాతాదారులపై ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ పడనుంది. 
 
ఎస్బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత రుణ రేటును(ఈబీఆర్) 25 బేసిక్ పాయింట్ల మేర తగ్గించటంతో ఈ రేటు 8.05 శాతం నుండి 7.8 శాతానికి దిగొచ్చింది. ఇప్పటికే గృహ రుణాలు తీసుకున్న ఖాతాదారులు మరియు ఎంఎస్‌ఎంఈలు 25 బేసిక్ పాయింట్ల మేర వడ్డీలో లబ్ధి పొందనున్నారు. డిసెంబర్ నెల తరువాత ఈబీఆర్ ఆధారిత రుణ రేటును తగ్గించిన ఒకే ఒక బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. 
 
ఏటీఎం మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్బీఐ ఓటీపీ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఏటీఎం మోసాలను అరికట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. 10,000 రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మాత్రమే నగదు విత్ డ్రా చేసే వీలు ఉండటంతో మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. 
 
పాత డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్న వారు ఆ డెబిట్ కార్డును మార్చుకోవాలని ఎస్బీఐ ఎప్పటినుండో కస్టమర్లను కోరుతూనే ఉంది. నిన్నటినుండి పాత మ్యాగ్నటిక్ డెబిట్ కార్డులు పని చేయట్లేదు. పాత మ్యాగ్నటిక్ డెబిట్ కార్డులు ఉన్నవారు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో యాప్ ఉపయోగించి లేదంటే బ్యాంకుకు వెళ్లి కొత్త ఏటీఎం కార్డును పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు అకౌంట్ లో ఉన్న అడ్రస్ కు ఏటీఎం కార్డు వెళుతుందని అడ్రస్ మారి ఉంటే అప్ డేట్ చేసుకోవాలని కస్టమర్లకు సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: